రామగుండంలో ఓట్ల పండుగ..ఖ‌రీదైన గిఫ్టుల‌తో టార్గెట్

by velandi.Saikiran |   (  Updated:2026-02-06 21:16:06  IST  )

రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో నగరం మొత్తం ఓట్ల పండగను తలపిస్తోంది. ప్రతి వార్డు, ప్రతి వీధి, ప్రతి ఇంట్లో ఎన్నికల హడావుడి స్పష్టంగా కనిపిస్తోంది.

రామగుండంలో ఓట్ల పండుగ..ఖ‌రీదైన గిఫ్టుల‌తో టార్గెట్
X

దిశ, గోదావరిఖని: రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో నగరం మొత్తం ఓట్ల పండగను తలపిస్తోంది. ప్రతి వార్డు, ప్రతి వీధి, ప్రతి ఇంట్లో ఎన్నికల హడావుడి స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాలంటే ఆసక్తి లేని సాధారణ ప్రజల ఇంటి ముందు కూడా అభ్యర్థుల సందడి పెరిగింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన కార్పొరేటర్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఒకరికి మించిన హామీలు, ఇంకొక్కరు ఇస్తూ వినూత్న ప్రచారాలు చేస్తున్నారు. వ్యక్తిగత పరిచయాలు, చిన్నతనం దోస్తానా, పార్టీ అభిమానులు, సామాజిక సమీకరణాలు ఇవన్నీ ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. పెద్దల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవడం, యువతను ఆలింగనం చేసుకోవడం, మహిళలను అక్క, బావ, అత్తయ్య అంటూ ఆప్యాయంగా పలకరించడం అభ్యర్థులు ఎవరికి వారు తమదైన శైలిలో ఓటర్లను ఆకర్షించడానికి అనేకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒక ఇంట్లో కూర్చొని చాయ్ తాగడం నుంచి, మరో ఇంట్లో కుటుంబ సమస్యలు వింటూ పరిష్కార హామీలు ఇవ్వడం వరకు అన్ని పార్టీల అభ్యర్థుల ప్రచారం నిత్యం సాగుతోంది. ఇక ఎన్నికలంటే తప్పనిసరిగా వినిపించే అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. కొందరు అభ్యర్థులు తాగేవారికి మద్యం, మాంసం తినిపియడం, గిఫ్టులు, డబ్బులు పంచడం వంటి మార్గాల్లో ఓట్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నిజాయితీగా పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఒక్కో వార్డులో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోటీ మరింత పోటాపోటీగా మారింది. ఈసారి మన వార్డు ఎవరి చేతుల్లోకి వెళ్తుంది. అన్న చర్చలు టీ షాపుల దగ్గర నుంచి కాలనీల సమావేశాలలో వినిపిస్తున్నాయి. మొత్తానికి రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఓట్ల పండగలా కొనసాగుతున్నాయి. అయితే హామీల వర్షం, ఆకర్షణల హడావుడి మధ్య ప్రజల సమస్యలు, అభివృద్ధి లక్ష్యాలు ఎంతవరకు ఉంటాయన్నదే అసలు ప్రశ్నగా నిలుస్తోంది.

ఓటు పవిత్రమా...

పండగ పేరుతో పంచుడు రాజకీయమా...

రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ప్రజాస్వామ్య ఓట్ల పండగగా మొదలై, ఇప్పుడు ఓట్ల వేలంగా మారుతున్నాయా అన్న అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రతి వార్డు ఒక ప్రచార వేదిక, ప్రతి ఇల్లు ఒక రాజకీయ అడ్డాగా మారింది. పోటీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థుల కాళ్లు అరిగిపోయాయి, అభివృద్ధి మాటలతో మొదలైన ప్రచారం క్రమంగా బహుమతులు, భోజనాలు, మద్యం, డబ్బుల చుట్టూ తిరుగుతోందన్న విమర్శలు బలంగా వినబడుతున్నాయి.

ఎన్నికల కోడ్ ఉన్నా...

ఓట్ల పండగ ముసుగులో జరిగే పంచుడు రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అభ్యర్థుల హామీల వర్షంలో అసలు సమస్యలు మరుగున పడుతున్నాయి. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, ఉపాధి ఇవన్నీ ఓట్ల రోజుకి మాత్రమే గుర్తొచ్చే అంశాలుగా మారిపోతున్నాయి.

ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరో.. ఓడిపోతున్నది ప్రజాస్వామ్య విలువలేనా.

అన్నదే రామగుండం ప్రజలు ఆలోచించాల్సిన అసలు ప్రశ్నలు.

అభివృద్ధి తక్కువ ఆకర్షణలు ఎక్కువ!

అక్కా, బావ పిలుపులు ఓటు వరకేనా పండగ ముసుగులో పంచుడు రాజకీయమా.. ఓటు అమ్ముడుపోతే రేపు పాలన ఎవరిది. రామగుండం ఓటర్ జాగ్రత్త. ఓట్లు పండగల కాదు బాధ్యత. మద్యం కాదు, అభివృద్ధి కావాలి.డబ్బుకి కాదు. మన భవిష్యత్​కు ఓటు వేయాలి రామగుండం ఓటర్లు మేల్కొని ఆలోచించాలి.కొందరు అభ్యర్థులు తాగేవారికి మద్యం, మాంసం తినిపియడం, గిఫ్టులు, డబ్బులు పంచడం వంటి మార్గాల్లో ఓట్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి

Next Story