భారీ వర్షానికి కుప్పకూలిన ఇల్లు.. కన్నీటిపర్యంతమైన బాధితులు

by Jakkula.Mamatha |

చుక్కల మధ్య కమ్మేసిన మబ్బులు, జడివానలా కురుస్తున్న వర్షం.. ఆ రాత్రి ఆ కుటుంబానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది.

భారీ వర్షానికి కుప్పకూలిన ఇల్లు.. కన్నీటిపర్యంతమైన బాధితులు
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్: ​చుక్కల మధ్య కమ్మేసిన మబ్బులు, జడివానలా కురుస్తున్న వర్షం.. ఆ రాత్రి ఆ కుటుంబానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. బతుకు భారాన్ని భరించేందుకు రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న ఆ చిన్న ఇల్లు, కన్నీటి బిందువులలా కరిగిపోయి నేలకూలింది. నిత్యం సంతోషంగా నవ్వులతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు విలపిస్తున్న గూడు కనిపించింది. ​హుజూరాబాద్ పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గుడ్డేలుగుల రవి, వనిత దంపతులు కూలిన ఇంటిని చూసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. గత కొద్ది రోజులుగా కూలి పని చేస్తూ ఈ ఇంట్లోనే వారి కుటుంబాన్ని వెల్లదీస్తున్నారు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కోతులు పైకప్పును పాడు చేయడంతో ఇంటికి పాలిథిన్ కవర్లతో రక్షణ చేసుకున్నారు.

ఏ నిమిషం ఏమవుతుందోనన్న భయం తో బతుకుతున్న వారి ఇల్లు ఎట్టకేలకు రాత్రి కురిసిన వర్షాలకు కూలిపోయింది. అది కేవలం ఒక ఇల్లు కాదు, ఇద్దరు చిన్న పిల్లల ఆశలు, భవిష్యత్తు, వారి కలలు. కానీ, ఆ కలలు అన్నీ ఒకేసారి కళ్ల ముందు కూలిపోయాయి. ఇల్లు కూలడానికి కొన్ని నిమిషాల ముందు అది కూలుతుంది అని తెలిసి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో బయటకు వచ్చారు. బయట బతుకు భద్రం అనుకున్నా, కళ్ల ముందు కుప్పకూలిన ఆ ఇల్లు ఆ దంపతుల గుండెల్లో గునపాలు దించినట్లు అనిపించింది. ​"ఇంకా ఈ బతుకులో ఏం మిగిలింది? పగలు పని చేసి రాత్రికి నిద్రపోయేందుకు ఒక ఇల్లు కూడా లేదా?" అని బాధితులు రవి కన్నీటి పర్యంతమయ్యారు. "గతంలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే మొదట నా పేరు వచ్చిందని చెప్పారు. కానీ తర్వాత దానిని రద్దు చేసి వేరే వాళ్లకు ఇచ్చేశారు. ఇప్పుడు ఈ దుస్థితికి ఎవరు బాధ్యులు?" అంటూ ఆయన వేసిన ప్రశ్నలు గుండెకు తగిలాయి. ​వారి దయనీయ పరిస్థితి చూసి కదిలిన స్థానికులు, నిస్సహాయంగా వారిని ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఈ వర్షాలు వారి కళ్ళలో నీరే కాదు, భవిష్యత్తుపై అలుముకున్న చీకటిని నింపాయి.

Next Story