రైతులను వేధిస్తున్న యూరియా కొరత

by Yella Dhawani Reddy |

యూరియా అందక అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతులకు సరిపడ యూరియా దొరక్క అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.

రైతులను వేధిస్తున్న యూరియా కొరత
X

దిశ,సైదాపూర్: యూరియా అందక అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతులకు సరిపడ యూరియా దొరక్క అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు ధరలు ఇష్టానుసారంగా పెంచేసి అమ్ముతుండటంతో రైతులకు భారం తప్పడం లేదు. ప్రభుత్వాలు మారినా రైతులకు యూరియా కొరత తప్పడం లేదు. ప్రస్తుతం ఖరీఫ్‌లో వరి పంట సాగు చేసే రైతులకు ఎరువుల కొరత ముఖ్యంగా యూరియా కోసం నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులు కావాలంటే ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తుంది. యూరియా కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. యూరియా నిలువ వచ్చిన రోజు సాయంత్రంలోపు పూర్తిగా అయిపోతుంది. తిరిగి నిలువ రావడానికి 5 లేదా వారం రోజుల సమయం వేచి ఉండాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎరువుల దుకాణాల్లో కూడా యూరియా కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా సైదాపూర్ మండలంలో వ్యాపారులు కృత్రిమ కొరత చూపిస్తున్నట్లు తెలుస్తుంది. రైతులకు అవసరం లేకపోయిన వ్యాపారులు సూచించిన ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇవ్వడం, యూరియాను అధిక ధరకు అమ్మకాలు చేపట్టడం చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో సైదాపూర్ మండలంలో 19500 వేల ఎకరాలలో పంటలు సాగు చేశారు. 15వేల ఎకరాల్లో వరి సాగు చేయగా 4వేల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. ౪౦౦ ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. పైరును ఎకరాకు 2 బస్తాలు వినియోగించినప్పటికీ 39000 బస్తాల యూరియా అవసరం ఉంటుంది. ఈ ఖరీఫ్ మొత్తాని 3200 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ప్రస్తుతం 877 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. అయితే పెద్ద రైతులు యూరియాను నిల్వ చేయటంతో సన్న, చిన్నకారు రైతులు క్యూలో నిలబడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వరి పంట సాగుచేసే రైతులకు యూరియా కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సరిపడా యూరియా దొరకడంలేదు

ప్రైవేట్‌ దుకాణాల్లో యూరియా నిలువ లేదంటున్నారు. సహకార సంఘం కేంద్రాల్లో ఒక్కొక్క రైతుకు మూడు బస్తాలు ఇస్తున్నారు. నేను ఆరు ఎకరాల వరి సాగు చేశాను. మూడు బస్తాలు ఎలా సరిపోతాయి. ఉన్నతాధికారులు స్పందించి సాగుకు సరిపడా యూరియా అందించి కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉంది.

చిక్కుల సంపత్, రైతు, ఎక్లాస్పూర్

ఒక్క బస్తా కూడా దొరకలేదు

గోదాంకు యూరియా వచ్చిందని తెలిసి ఉదయం గోదాం వద్దకు వెళ్లాను. అక్కడ రైతులు అందరూ లైన్ లో చెప్పులు పెట్టారు. నేను కూడా లైన్ లో చెప్పులు పెట్టాను. కానీ నా వరకు వచ్చేసరికి యూరియా బస్తాలు అయిపోయినాయి. నాకు ఒక్క బస్తా కూడా దొరకలేదు.

కొంకట సంపత్, రైతు,ఎక్లాస్పూర్

యూరియా కొరత లేదు

మండలంలో యూరియా కొరత లేదనీ మండల వ్యవసాయ అధికారి వైదేహి తెలిపారు. యూరియా అవసరం మేరకు పంపిణీ చేస్తున్నాం. రైతులు యూరియాను అవసరం మేర కంటే అధికంగా వినియోగిస్తున్నారు. యూరియాను అవసరం మేరకు మాత్రమే ఉపయోగిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటివరకు మండలంలో 877 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశాం. ఎరువుల కొరత రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.

వైదేహి,వ్యవసాయ అధికారి,సైదాపూర్

Next Story