- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పత్తాలేని పట్టా బుక్కులు..
తెలంగాణలో భూసమస్యల పరిష్కారం.. పారదర్శకత కోసం ‘ధరణి’ స్థానంలో ‘భూభారతి’ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.

దిశ, హుజురాబాద్ రూరల్ : తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం. పారదర్శకత కోసం ‘ధరణి’ స్థానంలో ‘భూభారతి’ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. వ్యవస్థ పేరు మారింది కానీ, క్షేత్రస్థాయిలో రైతన్నల కష్టాలు మాత్రం ఇంచు కూడా మారలేదు. రిజిస్ట్రేషన్లు వేగంగానే జరుగుతున్నా రైతు చేతికి అందాల్సిన 'పట్టాదారు పాసుపుస్తకం' మాత్రం అడ్రస్ లేకుండా పోయింది. హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా వందలాది మంది రైతులు గత ఆరు నెలలుగా పోస్ట్‌మాన్ ఎప్పుడు వస్తాడా.. అని కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. సాధారణంగా భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ సమాచారం సీసీఎల్ఏ నుంచి ముద్రణ సంస్థకు చేరుతుంది. అక్కడ పుస్తకం ముద్రించిన తర్వాత పోస్టల్ శాఖ ద్వారా నేరుగా రైతు ఇంటికే చేరాలి. అయితే గత ప్రభుత్వ హయాం నుంచి ముద్రణ సంస్థలకు, పోస్టల్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఆయా సంస్థలు సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు మారినా ఈ 'బకాయిల పంచాయితీ' తేలకపోవడంతో కొత్త పాసుబుక్కుల జారీ ప్రక్రియ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది.
సాఫ్ట్‌వేర్ సాకుతో కాలయాపన?
ధరణి పోర్టల్‌లోని లోపాలను సవరించి, మరింత పటిష్టమైన 'భూభారతి' సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే క్రమంలో జరుగుతున్న మార్పుల వల్లే ప్రింటింగ్ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ సాంకేతిక కారణాలతో తమకు సంబంధమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 1500కు పైగా పాసుబుక్కులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజుకు సగటున 100 వరకు లావాదేవీలు జరుగుతున్నా, కొత్త పుస్తకాల జారీ మాత్రం శూన్యం.
అప్పు పుట్టదు.. సాయం అందదు..
పాసుబుక్కులు చేతిలో లేకపోవడంతో రైతులు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా భూమి కొన్న వారికి పాసుబుక్కు లేనిదే బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదు. రబీ సీజన్ ప్రారంభమైన పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. రైతు భరోసా వంటి పెట్టుబడి సాయం అందాలంటే పాసుబుక్కు తప్పనిసరి. పుస్తకం లేకపోవడంతో వేల రూపాయల ఆర్థిక సాయాన్ని రైతులు కోల్పోతున్నారు. 2016-2018 మధ్య జరిగిన ఆన్‌లైన్ రికార్డుల నమోదులో జరిగిన తప్పులను సరిచేసుకుందామన్నా, కొత్త పుస్తకాలు రాక రైతులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించేనా?
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముద్రణ సంస్థల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం వ్యవస్థల పేర్లు మార్చడమే కాకుండా, సేవలను సకాలంలో అందించడంలోనూ చిత్తశుద్ధి చూపాలని అన్నదాతలు కోరుతున్నారు. యుద్ధప్రాతిపదికన పాసుబుక్కులు ముద్రించి, పోస్టల్ ద్వారా పంపిణీ చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు.
‘అప్పు పుట్టడం లేదు.. ఆఫీసర్లు కనికరించడం లేదు’
‘రిజిస్ట్రేషన్ చేసుకొని ఆరు నెలలు దాటింది. తహసీల్దార్ ఆఫీసుకెళ్తే 'వస్తాయి వెయిట్ చేయండి' అని చెబుతున్నారు తప్ప ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదు. పాసుబుక్కు లేక బ్యాంకులో లోన్ రావడం లేదు. అటు రైతు భరోసా రాక, ఇటు అప్పు పుట్టక దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. - హుజూరాబాద్‌కు చెందిన ఓ బాధిత రైతు ఆవేదన






