పంటచేలో విషాదం... గుర్తుతెలియని మృతదేహం కలకలం

by Bhanu |   (  Updated:2025-05-19 14:39:51  IST  )

పచ్చని పంటచేల మధ్య విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పచ్చునూర్ గ్రామ శివారులోని పంటపొలంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది.

పంటచేలో విషాదం... గుర్తుతెలియని మృతదేహం కలకలం
X

దిశ, మానకొండూరు : పచ్చని పంటచేల మధ్య విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పచ్చునూర్ గ్రామ శివారులోని పంటపొలంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఉదయం పొలం పనుల కోసం వెళ్లిన స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో, మానకొండూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు.

ప్రాథమిక విచారణలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరీంనగర్ అడ్డ ప్రాంతానికి చెందిన ఓ కూలిని ఓకాంట్రాక్టర్ మేస్త్రి, ఆంధ్రప్రదేశ్ నుండి పచ్చునూర్ గ్రామంలో నివాసం ఉంటూ కూలీలను పనుల నిమిత్తం పచ్చునూర్ గ్రామానికి తీసుకువచ్చినట్లు తెలిసింది. సుమారు 20 రోజుల క్రితం, ఇదే విధంగా అంజనేయులు అనే లేబర్ వ్యక్తిని కూడా పనికోసం మేస్త్రి నారాయణ తీసుకొచ్చాడు. అయితే, పది రోజులు పనిచేసిన అనంతరం అతన్ని పని నుండి తొలగించినట్లు నారాయణ పోలీసులకు చెప్పాడు. రోజువారీ కూలీతో పాటు భోజనం ఏర్పాటు చేసి, ₹7000 కూడా చెల్లించి పంపించానని అతడు తెలిపాడు.

ఇక్కడ అనేక ప్రశ్నలు ముప్పిరిస్తున్నాయి. మేస్త్రి నారాయణ, అంజనేయులును ఎందుకు హఠాత్తుగా పని నుండి తొలగించాడు? ఒకవేళ అతడు తిరిగి కరీంనగర్ వెళ్ళి ఉంటే, పచ్చునూర్ పొలంలో ఎలా మరణించాడు? ఈ మృతి వెనుక గల కారణాలేమిటి? పోలీసులు ఈ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి జేబులో లభ్యమైన ఒక సెల్ ఫోన్ ఈ కేసులో కీలకమైన ఆధారాన్ని అందించే అవకాశం ఉంది. ఫోన్లోని నెంబర్ల ఆధారంగా మృతుడి వివరాలు తెలుసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

మరోవైపు, మృతుడిని పనిలోకి తీసుకున్న మేస్త్రి నారాయణ మాత్రం తనకు ఏమీ తెలియదని చెప్పడం పోలీసులను మరింత ఆలోచనలో పడేసింది. అతడి మాటల్లోని నిజానిజాలు తేలాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతికి గల కారణాలు తెలుస్తాయి.

గుర్తుతెలియని వ్యక్తి మృతి పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కూలిపనిచేసే మృతునికి న్యాయం జరగాలని వారు కోరుకుంటున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరిపి, ఈ అనుమానాస్పద మృతికి గల కారణాలను వెలికితీయాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు ముగిసే వరకు అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.

Next Story