అవినీతికి అవిభక్త కవలలు ప్రధాని.. అదానీ : పురపాలక మంత్రి కేటీఆర్

by Disha Web Desk 1 |
అవినీతికి అవిభక్త కవలలు ప్రధాని.. అదానీ : పురపాలక మంత్రి కేటీఆర్
X

కోరుకంటి చందర్ కృషితో రామగుండానికి మెడికల్ కాలేజీ

మరో రెండు నెలల్లో ఇండస్ట్రీయల్, ఐటీ పార్కులకు శంకుస్థాపన

దిశ, గోదావరి ఖని : రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉంటారు.. కానీ ఇక్కడ రాష్ట్రాన్నే తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారక రామారావు అన్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృషి తోనే రామగుండానికి సీఎం కేసీఆర్‌ మెడికల్ కళాశాల మాంజూరు చేశారని, చందర్ లాంటి ఎమ్మెల్యే రామగుండం ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని మంత్రి అన్నారు.

సోమవారం రామగుండం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. రామగుండం నవ నిర్మాణ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2001 నుంచి సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో ఎమ్మేల్యే కోరుకంటి చందర్ నడిచారని, రామగుండం ప్రజల సమస్యల గురించి తప్ప ఎలాంటి పైరవీలు చేయలేదన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పోలీస్ కమిషనరేట్ నిర్మించుకున్నామని తెలిపారు. సీఎం ఈ ప్రాంతం అంటే ఎనలేని ప్రేమ అని.. సచివాలయం ప్రారంభం రోజున కూడా సీఎం కేసీఆర్ ఈ ప్రాంతం గురించి గుర్తు చేశారని అన్నారు.

గోదావరిలో నాణేలు వేసి మొక్కుకునేదని, గతంలో నీళ్లు లేకుండా గోదావరి ఉండేదని, ఇప్పుడు 365 రోజులు నీళ్లతో కళకళలాడుతోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని సీఎం సంకల్పించారని అన్నారు. మంచి పని తలపెడితే చెడగొట్టే వల్లే ఎక్కువ ఉంటారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు కొందరు నవ్వారని.. కానీ దేశం ఆశ్చర్యపడేలా సీఎం కేసీఆర్‌ చేసి చూపారని తెలిపారు. పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారని బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్, బీజేపీ నాయకులకు పదవులు ఉండేవా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు, అడగడానికి సిగ్గుండాలనీ 55 ఏళ్లు అధికారం ఇస్తే రైతులకు నీళ్లు, కరెంట్ ఇవ్వని నాయకులను నమ్మవద్దన్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని కేసీఆర్‌ నిలబెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చాక సింగరేణిలో 19,260 కొలువులను భర్తీ చేశామన్నారు. పదవీ విరమణ వయస్సు పెంచుకున్నామన్నారు.

18 శాతం ఉన్న బోనస్ 27 కు పెంచుకున్నామని తెలిపారు. అవినీతికి అవిభక్త కవలలు ప్రధాని, అదానీ అని మొత్తం దేశ సంపద వారికే కట్టబెడుతున్నారని అన్నారు. బండి సంజయ్ కి దమ్ముంటే ఎకరానికి రూ.10 వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కోరు కంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, బాల్క సుమన్, తదితరులు పాల్గొన్నారు


Next Story

Most Viewed