- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పసికందు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబం పై జరిగిన దాడి, రెండు నెలల పసికందు మృతికి కారణమైన ఘటన పై నిరసన జ్వాలలు మిన్నంటాయి.

దిశ, హుజూరాబాద్ రూరల్ : నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబం పై జరిగిన దాడి, రెండు నెలల పసికందు మృతికి కారణమైన ఘటన పై నిరసన జ్వాలలు మిన్నంటాయి. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రజక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో భారీ రాస్తారోకో నిర్వహించారు. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని కులం పేరుతో దూషిస్తూ ఆలయంలోకి రానివ్వకుండా కొందరు అగ్రకుల వ్యక్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాట, దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు వారి ఫిర్యాదును తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కరీంనగర్ - వరంగల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్
ఈ నేపథ్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసనకారులు బైఠాయించడంతో కరీంనగర్ - వరంగల్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న టౌన్ సిఐ కరుణాకర్ రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. అనంతరం రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిమ్మటూరి సాయికృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అమానుషంగా పసికందు మరణానికి కారణమైన వారిని వెంటనే జైలుకు పంపాలని, బాధితులను వేధించిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రజక సమాజంపై ఇలాంటి దాడులు పునరావృతమైతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం అని హెచ్చరించారు. కులం పేరుతో వివక్ష చూపి, ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, నిందితులపై హత్య కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొలిపాక సారయ్య, నల్ల బాలరాజ్, కొలిపక శ్రీనివాస్, కొండపాక పవన్, నల్ల సుమన్, మహిళా నేతలు కొండపాక లక్ష్మి, నిమ్మటూరి రమ, వసంత, భూలక్ష్మి, సరూప తదితరులు పాల్గొన్నారు. ప్రజాసంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్, శ్రీనివాస్, సాదుల రవీందర్ తమ మద్దతు ప్రకటించారు.






