మత రాజకీయాలతో అభివృద్ధి శూన్యం : మంత్రి అజారుద్దీన్

by Ratna Kumari |   (  Updated:2026-06-02 13:11:34  IST  )

మతాల పేరుతో రాజకీయాలు చేస్తే అభివృద్ధి సాధ్యం కాదని, తాను మత రాజకీయాలకు దూరంగా ఉంటానని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశారు.

మత రాజకీయాలతో అభివృద్ధి శూన్యం : మంత్రి  అజారుద్దీన్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : మతాల పేరుతో రాజకీయాలు చేస్తే అభివృద్ధి సాధ్యం కాదని, తాను మత రాజకీయాలకు దూరంగా ఉంటానని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అనేక ఉద్యమాల ఫలితంగా ఏర్పడిందని పేర్కొన్న మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో "రైజింగ్ తెలంగాణ" లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే విద్యా రంగంలో ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోందని తెలిపారు.

జగిత్యాల జిల్లాలో మైనార్టీలకు సంబంధించిన పలు సమస్యలు ఉన్నాయని పేర్కొన్న మంత్రి, ఈద్గా, కబరస్తాన్, ఉర్దూ పాఠశాల, స్కాలర్‌షిప్‌ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మైనార్టీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాను క్రికెటర్‌గా ఎంత వేగంగా బ్యాటింగ్ చేశానో, మంత్రిగా కూడా అంతే వేగంగా పనిచేస్తాను" అంటూ మంత్రి అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో మైనార్టీల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి మంత్రి అజారుద్దీన్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

Next Story