దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే మేడిప‌ల్లి స‌త్యం

by Ratna Kumari |

ద‌ళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద పీట వేస్తుంద‌ని చొప్ప‌దండి ఎమ్మెల్యే మేడిప‌ల్లి స‌త్యం పేర్కొన్నారు.

దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే మేడిప‌ల్లి స‌త్యం
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : ద‌ళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద పీట వేస్తుంద‌ని చొప్ప‌దండి ఎమ్మెల్యే మేడిప‌ల్లి స‌త్యం పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌర‌స్తా వ‌ద్ద ఉన్న జ‌గ్జీవ‌న్ రామ్ విగ్ర‌హానికి పూల మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా మేడిప‌ల్లి స‌త్యం మాట్లాడారు. మహనీయుల మాదిరి మనం కూడా ఉన్నతంగా ఆలోచించి గొప్ప పనులు చేయాలని సూచించారు. ఇండో- పాక్ యుద్ధ సమయంలో దేశాన్ని కరువు నుంచి కాపాడిన మహనీయుడు జ‌గ్జీవ‌న్ రామ్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన లోనూ జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమార్ అప్పటి లోక్ సభ స్పీకర్ కీలక పాత్ర పోషించి బిల్లు పాస్ చేయించారని గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. దళితులకు ఇందిరమ్మ ఇల్లు, అసైన్డ్ భూములు ఇచ్చినట్లు తెలిపారు.కాంగ్రెస్ హయాంలో ఎస్సీ వర్గీకరణ జరిగిందని.. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించడంతో నేడు అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి సమాజ అభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా, ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా అందించే సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. మీ సమస్యలను మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. దేశానికి జగ్జీవన్ రామ్ అందించిన సేవలు వెలకట్టలేనివని.. ఆ మహనీయుడు స్ఫూర్తితో ముందుకు సాగుదామని పేర్కొన్నారు.


కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ న్యాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా దేశానికి 30 ఏళ్లు సేవలందించిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు. సమానత్వం కోసం ఎంతో కృషి చేశాడని వివరించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ, పరిహారం అందించే విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కులాంతర వివాహాలు చేసుకున్న పలువురికి ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల (రెవెన్యూ) కలెక్టర్ లక్ష్మీ కిరణ్, కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్, జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘం, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Next Story