మానేరు పక్కనే ఉన్న ఇసుక కరువు..

by Kodari Anjali |

జమ్మికుంట పక్కనే ప్రవహించే మానేరు నదిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి.

మానేరు పక్కనే ఉన్న ఇసుక కరువు..
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణ ప్రజలకు ఇసుక అందని ద్రాక్షలా మారింది. పక్కనే మానేరు నది పారుతున్నా, ఆ నది నుంచి రాష్ట్రం నలు దిక్కులకు ఇసుక ట్రక్కులు వెళ్తున్నా.. స్థానికులకు మాత్రం ట్రాక్టర్ ఇసుక రూ.6000 నుంచి రూ.7000 వరకు పెట్టి కొనాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఇళ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేసుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నాయకుల వైఫల్యం...

జమ్మికుంట పక్కనే ప్రవహించే మానేరు నదిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రతిరోజూ వందల ట్రక్కులు, ట్రాక్టర్లలో ఇసుక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి దూర ప్రాంతాలకు తరలిపోతోంది. తలకట్టునా సముద్రం ఉంచుకొని చాప నీళ్లకు ఏడ్చినట్టు అన్నచందంగా ఇక్కడి ప్రజల పరిస్థితి ఉంది. జమ్మికుంట పట్టణ వాసులకు మాత్రం ఆ ఇసుక అందుబాటులో లేకపోవడం గమనార్హం. ‘మా ఊరి ఇసుక మాకు దొరకట్లేదు, బంగారంలా మారింది’ అని స్థానికులు వాపోతున్నారు. మానేరు నుంచి తవ్వి నేరుగా బయటకు తరలిస్తున్నారు. స్థానికంగా అమ్మితే తక్కువ రేటు వస్తుందని, దూరం తీసుకెళ్తే ఎక్కువ లాభం అనే ఉద్దేశంతో వ్యాపారులు ఇక్కడ అమ్మడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం నాయకులు చొరవ చేసుకొని అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

పేద మధ్యతరగతులపై ఇసుక ప్రభావం

ట్రాక్టర్ ఇసుక రూ.7,000 అంటే, ఒక గది నిర్మాణానికే ఇసుక ఖర్చు రూ.30,000 దాటుతోంది. దీంతో చిన్నపాటి మరమ్మతులు కూడా చేసుకోలేక పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఇసుక ధర విపరీతంగా పెరగడంతో పట్టణంలో చిన్న కాంట్రాక్టర్లు, మేస్త్రీలు, కూలీలకు పని దొరకడం లేదు. నిర్మాణాలు నిలిచిపోయాయి. లీగల్‌గా దొరక్కపోవడంతో అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సిన ఆదాయం పోతుంది.

ప్రభుత్వం స్పందించాలి...

జమ్మికుంట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఇసుక స్టాక్ యార్డు ఏర్పాటు చేసి, స్థానిక అవసరాలకు ముందుగా ఇసుక కేటాయించాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక అందేలా చూడాలి. ట్రాక్టర్‌కు రూ.2,000 నుంచి రూ.3,000 మించకుండా చర్యలు తీసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ వెంటనే స్పందించి మానేరు ఇసుకలో జమ్మికుంట వాటా జమ్మికుంటకే దక్కేలా కలెక్టర్‌తో మాట్లాడాలని ప్రజలు కోరుతున్నారు.‘పక్కనే నది ఉండి కూడా మేము ఇసుక కోసం ఇంత కష్టపడాలా? ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మాకు న్యాయం చేయాలి’ అని జమ్మికుంట వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story