- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేషన్ దందా.. సరిహద్దులు దాటుతున్న సన్న బియ్యం!
రేషన్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది.

దిశ, కరీంనగర్ టౌన్ : రేషన్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది. లబ్ధిదారులకు దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలనే ప్రభుత్వ సదుద్దేశం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. కొందరు అక్రమార్కులు తూర్పు పల్లెల మీదుగా సన్నబియ్యాన్ని సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. కేజీకి రూ.20 నుంచి రూ.25 ఇచ్చి లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేస్తున్న దళారులు గోదారి మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. సన్నబియ్యం భారీగా అక్రమ రవాణాకు గురవుతున్నా... అధికారులు కనీసం పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
మారని అక్రమార్కుల తీరు..
ఉగాది నుంచి ఉచిత బియ్యం పంపిణీలో భాగంగా ప్రభుత్వం లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. దీంతో ప్రతి ఒక్కరూ రేషన్‌షాపుల్లో బియ్యం తీసుకుంటున్నారు. ఈ బియ్యాన్ని ఇంటి అవసరాలకు వినియోగించకుండా అమ్మితే రేషన్‌కార్డు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. అయినా కొందరు వాటిని పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. మొదట్లో వీటి విక్రయాలు కాస్త తగ్గగా, నెల రోజులుగా దందా మళ్లీ మొదలైంది. కొందరు దళారులు ఉమ్మడి జిల్లాల్లోని మంథని, పెద్దపల్లి, గోదావరిఖని లాంటి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మధ్యతరగతి లబ్ధిదారుల నుంచి సన్న బియ్యం సేకరించి, మహారాష్ట్రలోని సిరోంచ ప్రాంతానికి తరలిస్తున్నారు.
అడ్డుకట్ట పడేనా..
ఉమ్మడి జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు రేషన్ మాఫియా ఆగడాలను బహిర్గతం చేస్తున్నాయి. గతంలో దొడ్డు బియ్యం రవాణాను అడ్డుకునేందుకు అటు పోలీసులు, ఇటు పౌరసరఫరాల శాఖ, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, విజిలెన్స్ వేర్వేరుగా తనిఖీలు చేపట్టేవి. ప్రస్తుతం సన్నబియ్యం ఇస్తుండటంతో వీటి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిందనే ఉద్దేశంతో ఈ బృందాలు రిలాక్స్ అయ్యాయి. తిరిగి అక్రమ దందా జోరందుకుంటున్న నేపథ్యంలో సంబంధిత విభాగాలు నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే తనిఖీలు చేపడితేనే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
ఇళ్ల వద్ద కొనుగోలు..
దళారులు ఇంటింటికీ వెళ్లి సన్నబియ్యం సేకరిస్తున్నారు. రేషన్‌కార్డుదారులు కొందరు సన్నబియ్యం రేషన్ దుకాణాల వద్దే విక్రయించేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు కిలోకు రూ.10 నుంచి రూ.15 చొప్పున లబ్ధిదారులు వ్యాపారులకు విక్రయించేవారు. ఇప్పుడు సన్నబియ్యం కావడంతో కిలో రూ.20 నుంచి రూ.25 వరకు అమ్ముతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ప్రతి నెలా వస్తున్న కోటాలో దాదాపు 20-30 శాతానికి పైగా పక్కదారి పట్టేలా వ్యాపారులు చూస్తున్నారు. ఇలా తమ దందాను సిద్ధం చేసుకున్నారు. పల్లెలు, పట్టణాల నుంచి సేకరించిన సరకును కొందరు ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మహారాష్ట్రకు తరలించేస్తున్నారు.
READ MORE ......
BIG News: ట్విన్ సిటీస్ పబ్లిక్కు బిగ్ అలర్ట్.. కొత్త రేషన్‌కార్డులకు వచ్చే నెల నుంచి రేషన్






