పనులు పూర్తైనా.. వంతెన ప్రారంభించరా..?

by Nagam Mallesh |
పనులు పూర్తైనా.. వంతెన ప్రారంభించరా..?
X

దిశ రామడుగు : పనులు పూర్తయినా సరే బ్రిడ్జిని మాత్రం అధికారులు ప్రారంభించట్లేదు. ఇదే ఇప్పుడు మండలంలో దుమారం రేపుతోంది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో బ్రిడ్జి నిర్మించినప్పటికీ అధికారుల అలసత్వంతో అది అలంకారప్రాయంగా మారింది. బ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణ చేసిన పిదప పనులు ప్రారంభించాల్సిన అధికారులు దురుద్దేశ్యంతోనే భూసేకరణ చేయకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో నిర్మాణం పూర్తయినా అలంకార ప్రాయంగా ఉండాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో స్థానికులు ప్రాణాలు పోయినా పట్టించుకోరా అంటూ అధికారులు, పాలకులపై జనం మండిపడుతున్నారు.

వంతెన ప్రారంభానికి అడ్డంకి గా మారిన భూసేకరణ

రామడుగు మండల కేంద్రం మీదుగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రదాన రహదారిలో పురాతన వంతెన శిథిలం కావడంతో తెలంగాణ రాష్ట్రం ఎర్పడ్డాక అప్పటి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టి నిధులు విడుదల చేసింది. అయితే ముందస్తుగా భూసేకరణ చేయాల్సిన అదికారులు కుట్ర పూరితంగానే బ్రిడ్జి నిర్మాణ పనులను మొదలుపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే భూ నిర్వాసితులకు అడిగినంత ఇవ్వడానికి అవకాశం ఉంటుందని భావించిన అధికారులు బ్రిడ్జి నిర్మాణ పనులు ముందుగా చేసి భూసేకరణ జాప్యం చేశారని అంటున్నారు. బ్రిడ్జి వినియోగంలోకి రావాలంటే భూ సేకరణ ఎలాగైన జరగాల్సిందే. దీంతో ప్రభుత్వం భూ బాధితుల డిమాండ్ కు తలొగ్గుతుంది. అందుకు ఎక్కువ మొత్తంలో అంచనాలు పంపించి బాధితులకు పరిహారం ఇప్పించి మూడో కంటికి తెలవకుండ తమ వాట తాము తీసుకునేందుకు భూ యజమానులతో కలిసి చేసిన కుట్ర ఫలితమే నేడు బ్రిడ్జి ప్రారంభానికి నోచుకోక పోవడానికి ప్రధాన కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

ప్రారంభం నుంచి అధికారుల అలసత్వమే

రామడుగు పురాతన బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో ముందస్తుగా మరో బ్రిడ్జి నిర్మించాలంటూ ఉమ్మడి రాష్ట్రంలో చాలాకాలం నుండి స్థానికంగా డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అందుకు ముందుకు రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఎర్పడ్డాక ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించిన అధికారుల అలసత్వంతో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడి విమర్శలు వెల్లువెత్తాయి. నిర్మాణా కాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్ నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని నాణ్యతలోపం పై ప్రజాసంఘాలు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ అధికారులు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై అప్పట్లో వెల్లువెత్తాయి

ప్రాణాలు పోయాక పచ్టించుకుంటారా?

వంతెన పనులు నిలిచిపోవడానికి ప్రధాన కారణం అంచనా విలువ పెరగడమే అంటున్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వంతెన నిర్మాణం పనులు మధ్యలో నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని.. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ప్రయాణించే పరిస్థితి దాపురించిందని స్థానికులు పాలకులపై మండిపడుతున్నారు. రామడుగు మండల కేంద్రం నుండి దాదాపు రెండు జిల్లాలను కలుపుకొని నాలుగు ఐదు మండలాల ప్రజలు రాకపోకలు ఈ వంతెన పైనుండి నిత్యం కొనసాగుతున్నప్పటికీ పురాతన వంతెన పూర్తిస్థాయిలో శిథిలమై ప్రమాదకరంగా మారిన తాత్కాలిక మరమ్మతులు సైతం చేపట్టకపోవడంతో ఆర్ అండ్ బి శాఖ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలుపోయాక పట్టించుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

విరుద్ధంగా కోట్ల రూపాయల అంచనా

భూ నిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారం అంచనా వేయడంలో అధికారులు వాస్తవానికి విరుద్ధంగా కోట్ల రూపాయల అంచనా పంపడం బ్రిడ్జి ప్రారంభానికి అడ్డంకిగా మారింది. ఉమ్మడి జిల్లాలో భూ సేకరణ చేసిన అధికారులు గతంలో ఏ ప్రాజెక్టులో ఈ స్థాయిలో నష్ట పరిహారం చెల్లించకపోవడంతో అనుమానం వచ్చి నష్ట పరిహారాన్ని పెండింగ్ లో పెట్టారని.. ఈ విషయం స్థానికంగా ప్రచారం జరిగి వివాదాస్పదంగా మారింది. దీంతో పలు ప్రజా సంఘాలు అధికారుల తీరును ఖండిస్తు ఆందోళనలు చేసి నిరసనలు తెలిపాయి అయినప్పటికి సమస్య మాత్రం పరిష్కారం కాకపోగా అక్కడ భూమికి అంత విలువ ఉందా అంటూ స్థానికులు అవాక్కవుతున్నారు.

అక్రమ అంచనాల వెనుక ఉన్నదెవరు?

అయితే వాస్తవ ధరకు మించి పెద్దమొత్తంలో అంచనా విలువలు వేయడంలో తెరవెనుక ఉన్నది ఎవరనేది స్థానికంగా చర్చజరుగుతుంది. కొంత మంది స్వార్థంతో ఎక్కువ మొత్తంలో లభ్థి పొందేందుకు చేసిన కుట్ర ఆ ప్రాంత ప్రజలకు శాపంగా పరిణమించి ప్రమాదపు అంచున ప్రయాణం కొనసాగించాల్సిన దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed