సిరిసిల్ల కాంగ్రెస్ టికెట్‌పై వీడిన ఉత్కంఠ.. పార్టీ వీడనున్న కీలక నేత

by Disha Web Desk 23 |
సిరిసిల్ల కాంగ్రెస్ టికెట్‌పై వీడిన ఉత్కంఠ.. పార్టీ వీడనున్న కీలక నేత
X

దిశ,సిరిసిల్ల : సిరిసిల్ల కాంగ్రెస్ టికెట్ పై ఉత్కంఠ వీడింది. గత కొద్ది రోజులుగా నువ్వా నేనా అంటూ కొనసాగిన రసవత్తరమైన ప్రక్రియకు సోమవారంతో తెరపడింది. ముచ్చటగా మూడోసారి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టికెట్ కేకే మహేందర్ రెడ్డి ని వరించింది. సిరిసిల్ల కాంగ్రెస్ టికెట్ కోసం కేకే మహేందర్ రెడ్డి,చీటీ ఉమేష్ రావు, నాగుల సత్యనారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్ లు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారి కాకుండా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మశాలి నేతల లగిశెట్టి శ్రీనివాస్, తీన్మార్ మల్లన్న లకు సిరిసిల్ల టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఊహాగానాలు వినబడుతున్న నేపథ్యంలో కువైట్ రాజకీయాలకు తెర పడి కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిరిసిల్ల బరిలో కొనసాగుతున్నట్లు అధిష్టానం సోమవారం రాత్రి ప్రకటించింది. దీంతో కేకే అనుచర వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. టికెట్ రాని ఆశావాహులకు మాత్రం నిరాశే ఎదురైంది.

ఢిల్లీలో పావులు కదిపినా ఆశావాహులు..

కేకే మహేందర్ రెడ్డికి టికెట్ రాకుండా ఆశావాహులు గట్టిగానే పావులు కదిపారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మొదటి విడతలోనే కేకేకు టికెట్ రావాల్సి ఉండగా సిరిసిల్ల టికెట్ ఆశపడ్డ ఉమేష్ రావు ఢిల్లీలో తిష్టవేసి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కేకెకు టికెట్ ఇవ్వకూడదని మంతనాలు జరిపినట్లు సమాచారం. సంగీతం శ్రీనివాస్ కూడా తాను సాన్నిహిత్యంగా ఉండే పార్టీ పెద్దలతో కలిసి కేకే కు టికెట్ రాకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు గట్టి పోటీ కేకేనే అని భావించిన అధిష్టానం కేకే మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది.

పార్టీని వీడనున్న కీలక నేత

సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో ముందునుంచే వర్గ విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. కేకే మహేందర్ రెడ్డిది ఒక వర్గమైతే, చీటీ ఉమేష్ రావు, సంగీతం శ్రీనివాస్ లది మరో వర్గంలా చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరిసిల్ల టికెట్టును అధిష్టానం కేకేకు ప్రకటించింది. ముందునుంచే చీటీ ఉమేష్ రావు కేకేకు టికెట్ ఇస్తే మద్దతు తెలుపను, ప్రచారం చేయను అని బహిరంగంగానే చెప్పారు. టికెట్ ఆశించి భంగపడ్డ మరో కీలక నేత పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు సిరిసిల్లలో కాంగ్రెస్ గాలి వీస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కలిసి కట్టుగా పోరాడితే విజయం సొంతం చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆశావాహులను అధిష్టానం, పార్టీ పెద్దలు బుజ్జగించాల్సిన అవసరం ఉంది.

ముచ్చటగా మూడోసారి..

తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ వెన్నంటే ఉంటూ సిరిసిల్లలో ఉద్యమాన్ని తన భుజాలపై వేసుకొని నడిపించిన కేకే మహేందర్ రెడ్డిని వంచించి 2009 ఉప ఎన్నికల్లో కేసీఆర్ తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం సిరిసిల్ల టికెట్ కేటీఆర్ కు అప్పగించారు. ఉప ఎన్నికల్లో కేవలం రెండు వందల లోపు స్వల్ప ఓట్లతో కేకే ఓటమిపాలయ్యారు. 2010 వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే వరుసగా ఓటమి చవిచూశారు. సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా కేకేకు మంచి నాయకుడిగా గుర్తింపు ఉంది. టికెట్ రాకముందే కేకే మహేందర్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం కొనసాగిస్తూ, చాలామంది బీఆర్ఎస్ నేతలను పార్టీలోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి కేకేకు టికెట్లు రావడంతో మరింత ఉత్సాహంగా కేకే అనుచర వర్గం సిరిసిల్ల పట్టణంతో పాటు మండలాల్లో, గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం, బీసీల అండ, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పద్మశాలి ముఖ్యనేత గోలి వెంకటరమణతో పద్మశాలి ఓట్లు చీలే అవకాశం కేకేకు కలిసి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఆరు నెలలుగా ఒక యువ నేత ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కేకే గతం, ప్రస్తుత కార్యాచరణ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సిరిసిల్లలో కారు పార్టీ, మంత్రి కేటీఆర్ కు చుక్కెదురై అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Next Story

Most Viewed