- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరణంలోనూ మానవత్వం చాటిన సుప్రియ
జగిత్యాల పట్టణంలోని హనుమాన్‌వాడకు చెందిన అక్కపెళ్లి సుప్రియ (25) తన మరణానంతరం అవయవదానం చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల పట్టణంలోని హనుమాన్‌వాడకు చెందిన అక్కపెళ్లి సుప్రియ (25) తన మరణానంతరం అవయవదానం చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఆమె అవయవాలు ఇప్పుడు పలువురికి పునర్జీవం అందించబోతుండటంతో పట్టణ ప్రజలు సుప్రియను ప్రశంసిస్తున్నారు. స్కూటీ నడపడం నేర్చుకుంటున్న సమయంలో జరిగిన ప్రమాదంలో సుప్రియ తీవ్రంగా గాయపడింది. నర్సింగాపూర్ బైపాస్ రోడ్డుపై చెట్టుకు కట్టిన బర్రె కారణంగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. గత మూడు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు.
ఈ విషాద సమయంలో కూడా ఆమె భర్త అక్కపెళ్లి ప్రవీణ్, కుటుంబ సభ్యులు గొప్ప మనసుతో అవయవదానానికి ముందుకు రావడం అందరినీ కదిలించింది. జీవన్‌దాన్ ప్రతినిధుల సహకారంతో సుప్రియ గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, కళ్లను సేకరించినట్లు తెలిసింది. ఆమె అవయవాలతో పలువురికి పునర్జీవం లభించనున్నట్లు వైద్యులు తెలిపారు. సుప్రియకు తేజశ్రీ (6), వైష్ణక (3) అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన ఆ పిల్లలను చూసి కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒకవైపు ఆమె చేసిన అవయవదానాన్ని ప్రజలు ప్రశంసిస్తుండగా.. మరోవైపు ఆ చిన్నారుల భవిష్యత్తు తలచుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కన పశువులను నిర్లక్ష్యంగా కట్టేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఒక చిన్న నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. అయితే మృత్యువు సుప్రియను శారీరకంగా దూరం చేసినా, ఆమె చేసిన అవయవదానం ద్వారా మానవత్వం మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది.






