వైద్యంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ కోయ శ్రీ హర్ష

by Nallavelli.Anjaneyulu |

ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, రోగుల వద్ద డబ్బులు ఆశించినా సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు.

వైద్యంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : కలెక్టర్ కోయ శ్రీ హర్ష
X

దిశ,పెద్దపల్లి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, రోగుల వద్ద డబ్బులు ఆశించినా సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు. ముఖ్యంగా పోస్టుమార్టం ప్రక్రియ పూర్తిగా ఉచితమని, ఇందుకు ఎవరైనా డబ్బులు తీసుకుంటే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో గోదావరిఖని జనరల్ ఆసుపత్రి పని తీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ, రామగుండం మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఆయన ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

సమయపాలన, నాణ్యమైన వైద్యం తప్పనిసరి

ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సమయానికి, నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్నారు. వైద్యులు నిర్ణీత సమయానికి విధులకు హాజరుకావాలని, అత్యవసర మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద వచ్చే రోగులకు సైతం మెరుగైన సేవలు అందించాలన్నారు. వార్డుల్లో సేవలందించే వైద్యులు, సిబ్బంది రోగుల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు డిమాండ్ చేయకూడదని, ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలన్నీ ఉచితంగానే జరగాలని తేల్చిచెప్పారు.

మౌలిక సదుపాయాల మెరుగుదల

రోగుల సౌకర్యార్థం గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆర్వో ప్లాంట్ ఏర్పాటు, అంతర్గత సీసీ రోడ్లు, రోగుల సహాయకుల కోసం అదనపు షెడ్ల నిర్మాణం పూర్తయినట్లు తెలిపారు. సదరం శిబిరాన్ని ప్రత్యేక భవనానికి మార్చామని, జిల్లా మెడికల్ బోర్డు తరలింపును కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తామన్నారు. ఆసుపత్రి పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, అన్ని విభాగాల్లో నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రోగులు, వారి బంధువులు ఇబ్బంది పడకుండా తగినన్ని కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రికి తాను అందించిన 20 ఏసీలు, 23 ఫ్రిజ్‌లను రోగుల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. లిఫ్ట్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. రాష్ట్ర స్థాయిలో డయాగ్నస్టిక్ హబ్ ద్వారా పరీక్షా ఫలితాలు అందజేయడంలో పెద్దపల్లి జిల్లా అగ్రస్థానంలో నిలవడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో సేవలను మరింత మెరుగుపర్చడానికి ఆసుపత్రికి అవసరమైన పరికరాల జాబితాను అంచనాలతో సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. ఈఎన్‌టీ విభాగానికి అవసరమైన పరికరాలు సమకూర్చాలని, ఓపీ సేవల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను, డాటా ఎంట్రీ ఆపరేటర్లను అవుట్ సోర్సింగ్ విధానంలో వెంటనే భర్తీ చేసేలా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఫోరెన్సిక్ విభాగంలో డాక్టర్ల కొరత ఉన్న దృష్ట్యా అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల హెచ్‌ఓడీలు ప్రతి నెల తాము నిర్వహించిన ఆపరేషన్ల వివరాలతో ఖచ్చితమైన రికార్డులను సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story