సింగరేణిలో ‘పేపర్’ మాఫియా!

by velandi.Saikiran |   (  Updated:2025-12-13 22:15:43  IST  )

సింగరేణి సంస్థలో ఉద్యోగ నియామకాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ పోస్టుల భర్తీకి సంబం

సింగరేణిలో ‘పేపర్’ మాఫియా!
X

సింగరేణిలో ‘పేపర్’ మాఫియా!

ఉద్యోగ నియామకాల్లో ‘అవినీతి’ ఆరోపణలు

ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ అవుతున్నట్లు అనుమానాలు

రూ. లక్షలు దండుకుంటున్న అధికారులు?

నిర్వహణ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించాలని ఉద్యోగార్థుల డిమాండ్

దిశ, గోదావరిఖని: సింగరేణి సంస్థలో ఉద్యోగ నియామకాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఎగ్జామ్ పేపర్స్ తయారీ విభాగంలోనూ సంస్థలోని అధికారులే ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. రూ. లక్షలు తీసుకుంటూ వారే ఆ పేపర్లను కొందరు అభ్యర్థులకు లీక్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తి గోప్యత పాటించాల్సిన చోట పేపర్లు ముందుగానే బయటకు వస్తున్నాయని ఉద్యోగార్థులు, నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు ఆరోపిస్తున్నారు. పోటీ పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలను పరీక్షలు రాసే వ్యక్తులకు అందజేస్తున్నారని, ప్రశ్నలపై సూచనలు, ఆన్సర్లను డబ్బులు తీసుకొని సంబంధిత వ్యక్తులకు అందజేస్తున్నారని వాపోతున్నారు.

క్లరికల్స్ ఎగ్జామ్స్ లో అవినీతి ఆరోపణలు

గతంలో నిర్వహించిన సింగరేణి క్లరికల్ పోస్టు ఎగ్జామ్స్ లో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమందిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి పరీక్షలు రాయించి రూ. కోట్లు దండుకున్నారనే వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల్లోనూ ఇదేతంతు కొనసాగుతున్నదనే అనుమానాలను ఉద్యోగార్థులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కష్టపడి చదివిన తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. డబ్బులు పెట్టగలిగిన వారికే ఉద్యోగాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇన్ని ఆరోపణలు వస్తున్నా సింగరేణి యాజమాన్యం మౌనం వహిస్తుండడం పలు అనుమానాలు తావిస్తున్నది. యాజమాన్యం తక్షణమే స్పందించి పారదర్శకతతో ఎగ్జామ్స్ నిర్వహించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఉద్యోగార్థులు హెచ్చరిస్తున్నారు.

పారదర్శకత కోసం ఉద్యోగార్థుల డిమాండ్

ఉద్యోగ నియామకాలకు సంబంధించి సంస్థ పారదర్శకత పాటించాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ పేపర్స్ ను సంస్థలను అధికారులతో తయారుచేయించడం వెంటనే ఆపాలని కోరుతున్నారు. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహించే సంస్థలకు బాధ్యత అప్పగించాలని, లేదా బయటి ఏజెన్సీలకైనా పేపర్ తయారీ, నిర్వహణ బాధ్యత ఇవ్వాలని విన్నవిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలకు సంబంధించి లీకేజీ ఆరోపణలపై సీబీఐ లేదా విజిలెన్స్ విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

పరీక్షల నిర్వహణ ఏజెన్సీలకు అప్పగించాలి

-మిర్యాల రాజిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, టీబీజీకేఎస్

ప్రశ్నపత్రం తయారీలో సింగరేణి అధికారులు ఉండడంతో పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిక్రూట్ మెంట్ సెల్ ఎన్ని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినా.. కొంతమంది అధికారులు ఆ ప్రశ్నపత్రాలను అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇకముందు అలా జరగకుండా అధికారులు దృష్టి సారించాలి. సింగరేణిలో ఉద్యోగ నియామకాల కోసం చేపట్టే పరీక్షల నిర్వహణ బాధ్యతలను యాజమాన్యం ఏజెన్సీలకు అప్పగించి అవకతవకలు లేకుండా చర్యలు తీసుకోవాలి.

Next Story