ఇసుకమాఫియా ఇష్జారాజ్యం..కొండపాక చెరువు మధ్యలో

by velandi.Saikiran |   (  Updated:2026-07-01 23:30:47  IST  )

ఇసుక క్వారీ యాజమాన్యం కొండపాక చెరువు మధ్యలో నుంచి అక్రమంగా రోడ్డు వేసింది. చెరువు కట్ట మీదుగానే వందల ఇసుక లారీలను తిప్పుతున్నారు.

ఇసుకమాఫియా ఇష్జారాజ్యం..కొండపాక చెరువు మధ్యలో
X

దిశ, వీణవంక : వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి ఇసుక క్వారీ వల్ల స్థానిక రైతులు, మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ పొట్టపై కొడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీ నడుపుతున్న యాజమాన్యం ‘ఎవరూ మమ్మల్ని ఆపలేరు’ అంటూ బెదిరింపులకు దిగుతోందని ఆరోపిస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక క్వారీ

ఇసుక క్వారీ యాజమాన్యం కొండపాక చెరువు మధ్యలో నుంచి అక్రమంగా రోడ్డు వేసింది. చెరువు కట్ట మీదుగానే వందల ఇసుక లారీలను తిప్పుతున్నారు. దీంతో కట్ట బలహీనపడి, వర్షాకాలంలో తెగిపోయే ప్రమాదం పొంచి ఉంది. చెరువు శిఖం భూమిలో అనుమతి లేకుండా ఇసుక డంపులు పోసి నిల్వ చేస్తున్నారు. ఇది పూర్తిగా టీఎస్​ఎండీసీ నిబంధనలకు, ఇరిగేషన్ చట్టానికి విరుద్ధంగా ఇసుక క్వారీ నడుపుతున్నారు. పోతిరెడ్డిపల్లి నుంచి కొండపాక వరకు ప్రధాన రోడ్డుపై ఇసుక లారీలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నాయి. దీంతో రైతులు పొలాలకు వెళ్లలేక, స్కూల్ బస్సులు, అంబులెన్సులు కదల్లేక నరకం చూస్తున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.

‘ఎవరు మమ్మల్ని ఆపలేరు’

‘ఇదేంటని ప్రశ్నిస్తే క్వారీ యజమానులు, వారి మనుషులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ‘మీరేం చేసినా మమ్మల్ని ఆపలేరు, మేం చేసేది చేస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు’ అని స్థానిక రైతులు తెలిపారు. డబ్బు బలం, రాజకీయ అండదండలు ఉన్నాయనే ధీమాతోనే ఈ అరాచకాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వంపై గ్రామ ప్రజల ఆగ్రహం

ఇసుక క్వారీలు టీఎస్​ఎండీసీ ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. నిబంధనల అమలు, పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. అయినా అక్రమాలు యథేచ్ఛగా సాగుతుండటంతో ‘రేవంత్ ప్రభుత్వం రైతుల, మత్స్యకారుల పొట్ట కొడుతోంది’ అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు చేసినా మైన్స్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

అరాచకాలు ఆపకపోతే సహించం

‘ఇసుక క్వారీ యాజమాన్యాల అరాచకాలు ఇక సహించేది లేదు. వారి ఇష్టానుసారం ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా క్వారీలు నడిపితే ఊరుకునేది లేదు’ అని పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామస్తులు, రైతులు, మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు. క్వారీని తక్షణమే నిలిపివేసి చెరువును యథాస్థితికి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని తక్షణ విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

Next Story