గర్శకుర్తిలో ఆకలి చావు కలకలం

by Ratna Kumari |

మండలంలోని గర్శకుర్తి గ్రామంలో ఆకలి చావు ఘటన కలకలం రేపింది. ఒకప్పుడు గ్రామంలో ప్రభావం చూపిన వ్యక్తి చివరకు ఆర్థిక ఇబ్బందులతో ఆకలితో అలమటిస్తూ మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది.

గర్శకుర్తిలో ఆకలి చావు కలకలం
X

దిశ, గంగాధర : మండలంలోని గర్శకుర్తి గ్రామంలో ఆకలి చావు ఘటన కలకలం రేపింది. ఒకప్పుడు గ్రామంలో ప్రభావం చూపిన వ్యక్తి చివరకు ఆర్థిక ఇబ్బందులతో ఆకలితో అలమటిస్తూ మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది. వివరాల్లోకి వెళితే… గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన కల్వకోట విజేందర్ రావు (78) అనే వృద్ధుడు ఆకలి చావుకు గురైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఒకప్పుడు గ్రామంలో ఆర్థికంగా బలంగా ఉండి పలువురికి సహాయం చేసిన విజేందర్ రావు కాలక్రమేణా కుటుంబ పరిస్థితులు మారడంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. వయసు మీద పడడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో సరైన ఆహారం కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు.

దీంతో ఆయన కొన్ని రోజులుగా ఆకలితో అలమటిస్తూ తీవ్ర అస్వస్థతకు గురై చివరకు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు గ్రామంలో గౌరవ స్థానం కలిగిన వ్యక్తి చివరకు ఇలాంటి పరిస్థితుల్లో మృతి చెందడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. విజేందర్ రావుకు సరైన ఆదరణ లేకపోవడం, వృద్ధాప్య సమస్యలు కూడా ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి పూర్తి వివరాలు తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనపై గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Next Story