శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్

by Dishanational1 |
శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్
X

దిశ, కరీంనగర్: శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ మహిమాన్విత క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. దేవాలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ సీతారామ కళ్యాణోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ సీతారామ కళ్యాణాన్ని తిలకించారు. అలాగే కళ్యాణ మహోత్సవ వేడుకను తిలకించడానికి అశేష సంఖ్యలో వేలాదిగా భక్తులు తరలిరావడంతో శ్రీ మహాశక్తి దేవాలయ ప్రాంగణం భక్తజనసంద్రంతో కిటకిటలాడి శ్రీరామ నామ స్మరణతో మార్మోగింది. కళ్యాణానికి హాజరైన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ అనంతరం అన్న ప్రసాదాన్ని ఆలయ నిర్వాహకులు అందించారు. శ్రీ సీతారామ కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన కేబి శర్మ సంగీత విభావరి కార్యక్రమం భక్తులను అలరించింది. సీతారామ కళ్యాణం సందర్భంగా ఆలయ పురోహితులు, వేద పండితులు శ్రీ శ్రీరామనవమి, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ విశిష్టతను భక్తులకు తెలియజేశారు. హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీరామనవమనీ, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఎంతో విశిష్టత ప్రాముఖ్యత ఉందన్నారు.

ముఖ్యంగా శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో, అభిజిత్ ముహూర్తంలో త్రేతాయుగంలో జన్మించాడనీ, 14 సంవత్సరముల అరణ్యవాసం, రావణ సంహార అనంతరం శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడ‌య్యాడనీ ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని, శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందనీ, అందుకే చైత్ర శుద్ధ నవమి నాడు భారతీయులందరూ పరమ పవిత్రమైన రోజుగా భావించి, శ్రీరామ నవమి వేడుకలను, సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా, రమణీయంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుందని తెలిపారు. లోక కళ్యాణం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి, శ్రీ సీతారాముల పర్వదిన పరమార్ధం అన్నారు.


Next Story