వేములవాడ వెళ్లే భ‌క్తుల‌కు బిగ్ అల‌ర్ట్‌.. నేటి నుంచి మూడు రోజులు

by velandi.Saikiran |

వేములవాడ వెళ్లే భ‌క్తుల‌కు బిగ్ అల‌ర్ట్‌.. శివ‌రాత్రి నేప‌థ్యంలో భారీ ఏర్పాట్లు జ‌రిగాయి. భీమన్న ఆలయంలో నేటి నుండి మూడు రోజుల పాటు వేడుకలు జ‌రుగ‌నున్నాయి.

వేములవాడ వెళ్లే భ‌క్తుల‌కు బిగ్ అల‌ర్ట్‌.. నేటి నుంచి మూడు రోజులు
X

"మహా" జాతరకు ముస్తాబు

భీమన్న ఆలయంలో నేటి నుండి మూడు రోజుల పాటు వేడుకలు

విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం

దిశ, వేములవాడ : తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం మహాశివరాత్రి జాతర వేడుకలకు ముస్తాబైంది. నేటి నుండి మూడు రోజుల పాటు జరిగే వేడుకలలో భాగంగా భక్తులకు సమగ్ర సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం తో పాటు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అనుబంధం ఆలయాలను సైతం ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జాతరకు సుమారు 2నుండి 3లక్షల వరకు భక్తులు తరలివస్తారని అంచనా వేస్తూ ఆలయ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఆలయ పార్కింగ్ ప్రదేశంలో శివార్చన స్టేజ్, చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించి, స్వామి–అమ్మవార్ల లైటింగ్ డిజైన్లతో ఆకర్షణీయమైన ఆహ్వాన తోరణాలు నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం మైక్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో పాటు, తాత్కాలిక టాయిలెట్లు, సూచన ఫ్లెక్సీలు, రోడ్ల సదుపాయం, స్నానాల కోసం షవర్స్ ఏర్పాటు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జాతర ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో పాటు ఎస్పీ మహేష్ బి.గీతే, అదనపు ఎస్పీ చంద్రయ్య ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఇంచార్జీ కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. షిఫ్ట్‌ల వారీగా సిబ్బంది ఉండాలని అన్నారు. త్రాగునీటి సరఫరా, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు నిరంతరంగా అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. మహాశివరాత్రి జాతరను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలని కోరారు. ఎస్పీ మహేష్ బి.గీతే మాట్లాడుతూ ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామి వారిని దర్శించుకునేలా,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు, పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Next Story