జ‌గిత్యాల పాలిటిక్స్‌..విప్ జారీ చేసే అవకాశం?

by velandi.Saikiran |

జగిత్యాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవి చుట్టూ ఆసక్తికర రాజకీయ సమీకరణాలు నడుస్తున్నాయి. మేము సూచించిన వారికే చైర్పర్సన్ పదవి కట్ట పెట్టాలంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పట్టుబడుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ 26 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాకపోయినా ఇండిపెండెంట్లు, ఎంఐఎం మద్దతుతో జగిత్యాల బల్దియాపీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనుంది.

జ‌గిత్యాల పాలిటిక్స్‌..విప్ జారీ చేసే అవకాశం?
X

కాంగ్రెస్ లో పంతం నెగ్గేది ఎవరిది?

చైర్ పర్సన్ పదవికి వేరువేరు ప్రతిపాదనలు.

జగిత్యాల కాంగ్రెస్ లో ఆసక్తికర పరిణామం.

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవి చుట్టూ ఆసక్తికర రాజకీయ సమీకరణాలు నడుస్తున్నాయి. మేము సూచించిన వారికే చైర్పర్సన్ పదవి కట్ట పెట్టాలంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పట్టుబడుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ 26 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాకపోయినా ఇండిపెండెంట్లు, ఎంఐఎం మద్దతుతో జగిత్యాల బల్దియాపీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనుంది. ముందు నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వారికే చైర్ పర్సన్ పదవి ఇవ్వాలని జీవన్ రెడ్డి అధిష్టానాన్ని కోరుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వ్యవహరించిన తీరును హై కమాండ్ ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో ఎవరు సూచించిన అభ్యర్థి చైర్పర్సన్ గా అవుతారు అన్నది చూడాల్సి ఉంది.

= ఎవరి పంతం నెగ్గనుంది..!

శుక్రవారం వెలువడిన 50 వార్డులు ఉన్న జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారు 23 మంది ఉన్నారు. వీరిలో సంజయ్ కుమార్ ప్రతిపాదించిన 14 మంది, జీవన్ రెడ్డి ప్రతిపాదించిన 9 మంది ఉన్నారు. ఇక మరో నలుగురు ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు ఇండిపెండెంట్గా గెలిచారు. జీవన్ రెడ్డి బలపరిచిన మరో ఎనిమిది మంది స్వతంత్రులుగా విజయం సాధించారు. ఇలా ఇద్దరి మద్దతుతో స్వతంత్రులుగా గెలిచిన కౌన్సిలర్లను కలుపుకుంటే సంజయ్ వర్గం 18 మంది, జీవన్ వర్గం 17 మంది కౌన్సిలర్లతో బలాన్ని ప్రదర్శిస్తున్నారు. బల్దియాలో చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికలోనూ ఇద్దరు నేతలు వేర్వేరు పేర్లను ముందుకు తెస్తున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన సమిండ్ల వాణిని సంజయ్ కుమార్ ప్రతిపాదిస్తుండగా, మొదటి నుండి పార్టీకి సేవలందించిన మూలస్థాపు లావణ్యకే అవకాశం ఇవ్వాలని జీవన్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో మాజీ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి కూడా రేసులో ఉండటంతో పరిస్థితి మరింత సస్పెన్స్‌గా మారింది. ఇద్దరు నాయకుల్లో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాల్సి ఉంది.

విప్ జారీ చేసే అవకాశం?

మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ విప్ జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు ఏకాభిప్రాయంతో ముందుకు రావాల్సి ఉంటుంది. మరో ముగ్గురు కౌన్సిలర్లను కలుపుకొని పార్టీ నిర్ణయించిన వారికే మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టెక్నికల్ గా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బి ఆర్ ఎస్ లోనే కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన విప్ జారీ చేసే అవకాశం లేదు. అయితే డీసీసీ ప్రెసిడెంట్ విప్ జారీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

Next Story