అంద‌రి క‌న్ను జ‌గిత్యాల‌పైనే... జీవన్ రెడ్డి మ‌ద్ద‌తు ఎవ‌రికి ?

by velandi.Saikiran |   (  Updated:2026-02-12 22:31:08  IST  )

జగిత్యాల మున్సిపల్ రాజకీయాల్లో అసలు పోరు ఇప్పుడు చైర్‌పర్సన్ పీఠం చుట్టూనే తిరుగుతోంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరు వినగానే భగ్గుమంటున్న జీవన్ రెడ్డి వర్గం, చైర్‌పర్సన్ ఎన్నికలో పార్టీ ఆదేశాలకు లోబడుతుందా? లేక తమ రాజకీయ లెక్కలు ముందుకు తెస్తుందా? అన్న సందేహాలు గుభాళిస్తున్నాయి.

అంద‌రి క‌న్ను జ‌గిత్యాల‌పైనే... జీవన్ రెడ్డి మ‌ద్ద‌తు ఎవ‌రికి ?
X

‘తమ్మి నువ్వు గెలిస్తే చైర్మన్ కు నాకే సపోర్ట్ చెయ్యాలె.. ఇగో ఈ రెండు లక్షలు అయితే ఉండని వద్దు అనకు..పోయినసారే వదినకు చైర్ పర్సన్ సీట్ జరంతలో మిస్సయింది. ఈసారి అట్లా కావద్దు ఇంకేమైనా కావాలంటే చెప్పు కానీ వేరే వాళ్లకు అయితే మాట ఇవ్వకు.. అంటూ చైర్​పర్సన్ రేసులో ఉన్న ఓ మహిళ లీడర్ తన భర్తతో కలిసి గెలిచే అవకాశం ఉన్న ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఇంటికి వెళ్లి కలిసింది. ఇంతకాలం గులాబీ పార్టీలో ఉండి ప్రస్తుతం కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసిన ఈ మహిళా లీడర్ గతంలో చైర్​పర్సన్ సీట్ ఆశించి భంగపడగా ఈసారైనా కుర్చీ సొంతం చేసుకోవాలని ఆరాట పడుతుంది. అందుకోసం కౌంటింగ్ కు ముందే ఏకంగా కొందరికి డబ్బులు ముట్ట చెబుతుండడంతో పాటు మరికొందరితో భేరసారాలు ఆడుతున్నారు.’

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు నేడు ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుండగా, రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా జగిత్యాల బల్దియా పీఠం అధికార కాంగ్రెస్ పార్టీకే ఇజ్జత్ కా సవాల్‌గా మారింది. ఒకే పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేసిన నాయకుల్లో ముగ్గురు చైర్మన్ పీఠంపై కన్నేసి వ్యూహాలు రచిస్తుండటంతో పరిస్థితి మరింత రసవత్తరంగా మారింది.వలస లీడర్లు వర్సెస్ ఒరిజినల్ లీడర్లు అన్నట్లుగా సాగిన ఈ మున్సిపల్ పోరులో చివరికి ఏ వర్గం పైచేయి సాధిస్తుందో, ఎవరి ప్రభావం ఎంతవరకు పనిచేస్తుందో మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది. సంఖ్యల కంటే సమీకరణాలే నిర్ణయాత్మకంగా మారిన రాజకీయ వాతావరణం జగిత్యాలలో నెలకొంది.

దిశ, జగిత్యాల ప్రతినిధి: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు నేడు ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుండగా, రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా జగిత్యాల బల్దియా పీఠం అధికార కాంగ్రెస్ పార్టీకే ఇజ్జత్ కా సవాల్‌గా మారింది. ఒకే పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేసిన నాయకుల్లో ముగ్గురు చైర్మన్ పీఠంపై కన్నేసి వ్యూహాలు రచిస్తుండటంతో పరిస్థితి మరింత రసవత్తరంగా మారింది. కౌంటింగ్‌కు ముందే గెలుపు గుర్రాల చుట్టూ ప్రదక్షిణలు మొదలవగా, ఓ నాయకుడు తనకే మద్దతు ఇవ్వాలంటూ ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున శుక్రవారం పంపిణీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో కౌంటింగ్‌కు ముందే కుర్చీ కోసం కసరత్తులు జోరందుకున్నాయి.

జగిత్యాల బల్దియా సీట్ వెరీ కాస్ట్లీ.

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సీటు ఎవరిని వరిస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. రెండు గ్రూపులుగా మారిన కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు అభ్యర్థులు రేస్ లో ఉండగా సమీకరణాలు ఎలా మారుతాయి అన్నది చిక్కు ప్రశ్నగా మారింది. దానికి తోడు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు పెద్ద ఎత్తున ఇండిపెండెంట్స్ గా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో చైర్మన్ సీటు ఆశిస్తున్న వారు డబ్బు విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక దశలో స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారే అవకాశం ఉన్న తరుణంలో వారిని లెక్కింపునకు ముందే ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. జగిత్యాల మున్సిపల్ పీఠాన్ని ప్రవేశం చేసుకునేందుకు దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం మద్దత్తు ఎవ్వరికి?

జగిత్యాల మున్సిపల్ రాజకీయాల్లో అసలు పోరు ఇప్పుడు చైర్‌పర్సన్ పీఠం చుట్టూనే తిరుగుతోంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరు వినగానే భగ్గుమంటున్న జీవన్ రెడ్డి వర్గం, చైర్‌పర్సన్ ఎన్నికలో పార్టీ ఆదేశాలకు లోబడుతుందా? లేక తమ రాజకీయ లెక్కలు ముందుకు తెస్తుందా? అన్న సందేహాలు గుభాళిస్తున్నాయి. ఇప్పటికే తన అనుచరులను ఇండిపెండెంట్లుగా బరిలో దింపి, వారికి స్వయంగా ప్రచారం చేసిన జీవన్ రెడ్డి వైఖరి పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. సుమారు 60 శాతం స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ, ఆ స్థానాల్లోనే సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి వర్గాల వారిద్దరూ గెలిచే పరిస్థితి నెలకొనడం ఆసక్తి రేపుతోంది. మిగిలిన 40 శాతం సీట్లలో ఇండిపెండెంట్లు, బీజేపీ, ఎంఐఎం ప్రభావం చూపే అవకాశం ఉండడంతో, చివరికి చైర్‌పర్సన్ ఎన్నికలో మద్దతు ఎటు మళ్లుతుందో అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

వలస లీడర్లు వర్సెస్ ఒరిజినల్ లీడర్లు

అన్నట్టుగా సాగిన ఎన్నికలు

జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో కనిపించని ప్రత్యేక రాజకీయ సమీకరణాలు జగిత్యాలలో రూపుదిద్దుకున్నాయి. ఒకే పార్టీ నుంచి ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు రేసులో ఉండటం, అంతేకాకుండా అదే పార్టీ రెండు వర్గాలుగా విడిపోవడం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. ‘వలస వచ్చిన వారికి కాకుండా, కాంగ్రెస్ కోసం ఆది నుంచి కష్టపడిన వారికి చైర్మన్ సీటు ఇవ్వాలి’ అన్న డిమాండ్లు తెరపైకి రావడంతో చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై ఉత్కంఠ మరింత పెరిగింది. వలస లీడర్లు వర్సెస్ ఒరిజినల్ లీడర్లు అన్నట్లుగా సాగిన ఈ మున్సిపల్ పోరులో చివరికి ఏ వర్గం పైచేయి సాధిస్తుందో, ఎవరి ప్రభావం ఎంతవరకు పనిచేస్తుందో మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది. సంఖ్యల కంటే సమీకరణాలే నిర్ణయాత్మకంగా మారిన రాజకీయ వాతావరణం జగిత్యాలలో నెలకొంది.

Next Story