- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబుల్రోడ్డు నిర్మాణం ఇంకెప్పుడు?
కొత్తగా ఏర్పాటు చేసిన మండల కేంద్రాలకు డబుల్ రోడ్డు ఏర్పాటు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం మేరకు గ

దిశ, గన్నేరువరం : కొత్తగా ఏర్పాటు చేసిన మండల కేంద్రాలకు డబుల్ రోడ్డు ఏర్పాటు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం మేరకు గన్నేరువరం మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాలు గత మూడేళ్ల క్రితం మహాధర్నా చేపట్టి రోడ్డు ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఓ ప్రయత్నం చేయగా ఆ ధర్నా వద్దకు అప్పటి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రావడంతో యువజన సంఘాల నాయకులు సహనం కోల్పోయి ఏకంగా రసమయి బాలకిషన్ కారుపై దాడి చేసి అతడిని పరిగెత్తించారు. ఆ మహాధర్నా లో ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సైతం ప్రతిపక్ష నాయకుడిగా పాల్గొని యువజన సంఘాలకు మద్దతు పలికి, యువజన సంఘాల నాయకులతో పాటు కేసుల పాలు అయ్యారు. ఈ సంఘటన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణకు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. గన్నేరువరం మండలంలో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. యువజన సంఘాల అప్పటి మహా ధర్నా విజయవంతం కావడంలో అప్పటి ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేశాయి. ఎట్టకేలకు రసమయి బాలకిషన్ ప్రజా వ్యతిరేకతను చల్ల పరచడానికి హుటాహుటిన డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 77 కోట్ల తో నిధులు మంజూరైనట్లు తెలిపి రోడ్డు పనులు ప్రారంభించి ఓట్లు పొందే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు.
రోడ్డు పనుల నిర్లక్ష్యంతో మరో మహా ధర్నా.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు ప్రారంభించి చాలా రోజులు గడిచినప్పటికీ కాంట్రాక్టర్ బిల్లులు రావడం లేదనే సాకుతో రోడ్డు పనులు నిలిపివేయడంతో ప్రజల అవస్థలు మళ్లీ మొదలయ్యాయి. ఎన్నిసార్లు రోడ్డు పనులు చేపట్టాలని వివిధ రాజకీయ నాయకులు డిమాండ్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రజా ప్రయోజనం కోసం మళ్లీ యువజన సంఘాలు డబుల్ రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్ లేవనెత్తాయి. నిర్ణీత గడువులోపు పనులు ప్రారంభిస్తామని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ ఎమ్మెల్యే నుంచి యువజన సంఘాలకు సమాధానం రాకపోవడంతో మహా ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
మహాధర్నా లో ప్రతిపక్ష నాయకులు పాల్గొంటారా?.
యువకులపై పెట్టిన కేసుల సంగతి ఏంటి?
రేపు ఆదివారం జరిగే మహా ధర్నా లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొననున్నాడా.. బీజేపీ పార్టీ నుంచి జిల్లా స్థాయి నాయకులు పాల్గొంటారా.. కేవలం మండల స్థాయి నాయకుల మద్దతు మాత్రమే ఉంటుందా.. అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. అప్పుడు 10 ఏళ్లు నిర్లక్ష్యం చేసి ఇప్పుడు డబుల్ రోడ్డు కోసం రసమయి బాలకిషన్ మహాధర్నాలో పాల్గొనడం ఏంటని, అప్పుడు యువకులపై పెట్టించిన కేసుల సంగతి ఏంటని, ఆ కేసులను రసమయి బాలకిషన్ విత్ డ్రా చేసుకుంటాడా అని మరి కొంతమంది ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రోడ్డు సమస్య మూలంగానే నాడు యువజన సంఘాలు పోరాటం చేసి కేసుల పాలు అయ్యారు. కాబట్టి పెద్ద మనసుతో కేసులు విత్ డ్రా చేసుకోవడం తోపాటు రేపు జరిగే మహా ధర్నాలో పాల్గొని యువజన సంఘాలకు మద్దతుగా నిలవాలని, రేపు ఏవైనా చట్టపరంగా ఇబ్బందులు తలెత్తితే రసమయి బాలకిషన్ తో పాటు బీజేపీ నేతలు యువజన సంఘాలకు అండగా నిలవాలని మరి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. రేపు ఎంతమంది యువజన సంఘాలకు అండగా నిలుస్తా రో మహా ధర్నాను శాంతియుతంగా విజయవంతం చేసి ప్రభుత్వం దృష్టికి రోడ్డు దుస్థితిని, నిధుల లేమి పరిస్థితిని తీసుకపోవడంలో సఫలీకృతులు అయ్యి రోడ్డు పనులు వేగవంతం అయ్యేలా ఏ చర్యలు తీసుకుంటా రో వేచి చూడాలి.
యువకుల్లారా కాస్త జాగ్రత్త....
సమాజ హితం కోసం యువజన సంఘాలు చేస్తున్న పోరాటాలు ప్రశంసించదగినప్పటికీ చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే పోలీసులు పెట్టే కేసులతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి యువకులకు తప్పదు. గత మహా ధర్నా రసాభాస జరిగి పలువురుపై కేసులు నమోదు కాగా చాలామంది యువకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపు జరిగే మహా ధర్నా లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా యువజన సంఘాలు శాంతియుతంగా ధర్నా నిర్వహించాలి తప్ప రాజకీయ పార్టీల ఉచ్చులో చిక్కుకొని కేసు పాలు కావద్దని మరి కొంతమంది హితవు పలుకుతున్నారు. మహా ధర్నాకు మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీల నాయకులు యువజన సంఘాల సభ్యులకు ఇబ్బందులు తలెత్తకుండా అండదండగా ఉండాలని మరి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.






