వామ్మో.. రాజకీయాలా..? ఇప్పటికే 11 ఎకరాలు అమ్ముకున్నా... ఇక నా వల్ల కాదు

by Dishanational1 |
వామ్మో.. రాజకీయాలా..? ఇప్పటికే 11 ఎకరాలు అమ్ముకున్నా... ఇక నా వల్ల కాదు
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి జడ్పీటీసీ సభ్యురాలు పూర్మాణి మంజుల భర్త పూర్మాణి లింగారెడ్డి ప్రస్తుత రాజకీయాలపై సంచలన వాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ సభకు బయలుదేరుతున్న సమయంలో సిరిసిల్ల సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావ్ మాట్లాడుతూ జడ్పీటీసీ భర్త లింగారెడ్డిని.. కాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పదవి నీకే వస్తుంది.. అంటూ వాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా పూర్మాణి లింగారెడ్డి మనసులో ఉన్న మాట కక్కేశాడు.

'నేను ఇప్పుడు అందరు ముందు చెబుతున్నా.. నా జీవితంలో ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు నిలబడను' ఈ జడ్పీటీసీ పదవే లాస్ట్.. నేను రాజకీయాల్లోకి వచ్చి విలువైన 11 ఎకరాల భూమి అమ్ముకున్నా.. విలువైన కేబుల్ నెట్ వర్క్ ను అమ్ముకున్నా.. తీవ్రంగా నష్టపోయినా అంటూ తంగళ్లపల్లి టీఆర్ఎస్ శ్రేణుల ముందు, పాత్రికేయుల ముందు బహిరంగ ప్రకటన చేయడం కలకలం సృష్టించింది. తంగళ్లపల్లి మండల రాజకీయాల్లో టీఆర్ఎస్ నేత పూర్మాణి లింగారెడ్డి తనదైన ముద్ర వేసుకున్నాడు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం, మండల ప్రజలను అపదలో ఆదుకోవడం, రెండు సార్లు మండల జడ్పీటీసీగా తన భార్య మంజులను గెలిపించుకుని తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు.

టీఆర్ఎస్ పార్టీలో సూమారుగా 20 ఏండ్లుగా పనిచేస్తూ వచ్చిన లింగారెడ్డి రెండు సార్లు జడ్పీటీసీ ఐనప్పటికీ.. రాజకీయాలు తనకు చేదును మాత్రమే మిగిల్చాయని, ఆర్థికంగా చాలా నష్టపోయానని బాధపడటం అందరినీ కలిచివేసింది. మంత్రి కేటీఆర్ నామినేట్ పోస్టు ఇస్తే చేస్తాను కానీ.. ఈ ఖరిదైన ఎన్నికల్లో నిలబడి గెలిచే ఓపిక తనకు లేదని, ఎప్పుడు ఎన్నికల్లో నిలబడనని పేర్కొనడం సంచలనం సృష్టించింది. అక్కడున్న టీఆర్ఎస్ నాయకులు సైతం లింగారెడ్డి వాఖ్యాలతో అవాక్కయ్యారు. ప్రస్తుత రాజకీయాల్లో చాలామంది లీడర్లు ఆర్థికంగా చితికిపోతున్నారు. రాజకీయాలు అంతా ఆశామాషి కాదని లింగారెడ్డి వాఖ్యాలతో అర్థమవుతుంది. ఏది ఏమైనా తంగళ్లపల్లి జడ్పీటీసీ మంజుల భర్త పూర్మాణి లింగారెడ్డి వ్యాఖ్యలు తంగళ్లపల్లి మండలంలో తీవ్ర కలకలం సృష్టించాయి.

Next Story

Most Viewed