ఆస్తి పంచిన పాపానికి అన్నం పెట్టని కొడుకులు..!

by Ratna Kumari |

కన్నప్రేమ కరువైంది.. కని పెంచి, రెక్కల కష్టంతో ఆస్తులు కూడబెట్టి ఇచ్చిన ఆ తల్లికి చివరి దశలో ముద్దన్నం పెట్టడానికి కొడుకులకు మనసు రావడం లేదు. ఆస్తి పంపకాలప్పుడు ఉన్న ఉత్సాహం, తల్లిని సాకడంలో చూపడం లేదు సరికదా..

ఆస్తి పంచిన పాపానికి అన్నం పెట్టని కొడుకులు..!
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : కన్నప్రేమ కరువైంది.. కని పెంచి, రెక్కల కష్టంతో ఆస్తులు కూడబెట్టి ఇచ్చిన ఆ తల్లికి చివరి దశలో ముద్దన్నం పెట్టడానికి కొడుకులకు మనసు రావడం లేదు. ఆస్తి పంపకాలప్పుడు ఉన్న ఉత్సాహం, తల్లిని సాకడంలో చూపడం లేదు సరికదా.. అడుగడుగునా వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. హుజురాబాద్ మండలం కనుకుల గిద్ద గ్రామానికి చెందిన మోలుగు రాజమ్మ (80) కు ముగ్గురు కొడుకులు (కొమురయ్య, సమ్మయ్య, చంద్రయ్య). తన భర్త చనిపోయిన తర్వాత రాజమ్మ తనకున్న భూమిని ముగ్గురు కొడుకులకు తలా 20 గుంటల చొప్పున పంచి ఇచ్చింది. తన పేరు మీద ఉన్న మరో 25 గుంటల వ్యవసాయ భూమిని కూడా ముగ్గురికి సమానంగా ఇచ్చేసింది. చివరకీ తనకు వచ్చిన 'దళిత బంధు' పథకం లబ్ధిని కూడా కొడుకులకే ధారాదత్తం చేసింది. ​ఆస్తి పంపకాల సమయంలో ముగ్గురు కొడుకులు తలా 10 రోజుల చొప్పున తల్లిని పోషించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆచరణలోకి వచ్చేసరికి ముగ్గురూ మొహం చాటేశారు. ముఖ్యంగా రెండో కుమారుడు తనను పోషించకపోగా.. అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధిస్తున్నాడని రాజమ్మ కన్నీటి పర్యంతమైంది.

కూతురి పై కూడా వేధింపులు..

​కొడుకులు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం రాజమ్మ అదే గ్రామంలో ఉంటున్న తన కూతురు భూలక్ష్మి వద్ద ఆశ్రయం పొందుతోంది. అయితే "మా తల్లిని నీవు ఎందుకు పోషిస్తున్నావు?" అంటూ కొడుకులు తన కూతురిని కూడా వేధిస్తున్నారని రాజమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ​"నా సర్వస్వం కొడుకులకు రాసిచ్చాను.. ఇప్పుడు కనీసం బువ్వ పెట్టమంటే వేధిస్తున్నారు. నా బిడ్డ దగ్గర ఉంటున్నా వదలడం లేదు." బాధిత వృద్ధురాలు సీఐ తో కన్నీటి పర్యంతమైంది. తనకు న్యాయం చేయాలని, తన కొడుకులు కడుపు నిండా అన్నం పెట్టేలా చూడాలని రాజమ్మ టౌన్ సీఐ కరుణాకర్ ను వేడుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story