- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగిత్యాల జిల్లాలో వీరప్పన్‌ను మించిన స్మగ్లింగ్ ముఠా!
జగిత్యాల జిల్లా పరిధిలోని కథలాపూర్ శివారులో గల అటవీ సంపద అన్యాక్రాంతమవుతుంది. అటవీ ప్రాంతాలలోని విలువైన టేకు చెట్లను కలప స్మగ్లర్లు ఇష్టం వచ్చినట్లు నరుకుతున్నారు.

దిశ, కథలాపూర్: జగిత్యాల జిల్లా పరిధిలోని కథలాపూర్ శివారులో గల అటవీ సంపద అన్యాక్రాంతమవుతుంది. అటవీ ప్రాంతాలలోని విలువైన టేకు చెట్లను కలప స్మగ్లర్లు ఇష్టం వచ్చినట్లు నరుకుతున్నారు. పట్టపగలే నెంబర్ ప్లేట్లు లేని బండ్లపై వచ్చి టేకు దుంగలను కొడుతున్నారు. పగలు సేకరించిన కలపను అటవీ ప్రాంతాల్లోనే దాచి అర్థ రాత్రులు అక్రమంగా తరలిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ తంతు సాగుతున్నప్పటికీ ఫారెస్ట్ ఆఫీసర్లు మాత్రం తమకేమీ పట్టదు అన్నట్లుగా వ్యవరిస్తున్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ కు దూరంగా ఉంటూ కార్యాలయాల్లోనే కాలక్షేపం చేస్తున్నారని అటవీ శాఖ అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు.
వీరప్పన్ ను మించిన ముఠా..
విలువైన కలప నరికివేత అక్రమ రవాణాలో స్థానికంగా ఉన్న కొందరు స్మగ్లర్లు వీరప్పన్ ను మించిపోయారు. కథలాపూర్, మేడిపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల్లో సంచరిస్తున్న ఓ కలప స్మగ్లింగ్ ముఠా దమ్ముంటే పట్టుకోండి అంటూ ఫారెస్ట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు సవాల్ విసురుతున్నారు. గత కొంతకాలంగా ఈ నాలుగు మండలాల్లో సంచరిస్తున్న ఈ ముఠా సభ్యులు విలువైన కలప దుంగలను రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. ఈ క్రమంలో కేవలం ఫారెస్ట్ భూముల్లోని చెట్లను మాత్రమే కాకుండా పొలాల వద్ద ఏపుగా పెరిగిన రైతులకు చెందిన టేకు చెట్లను సైతం ఎత్తుకెళ్తున్నారు. కథలాపూర్ మండలంలోని తాండ్రియాలా, దూలూర్ గ్రామాలలో పొలం గట్ల వెంబడి పలువురు రైతులకు చెందిన 30కి పైగా ఏపుగా పెరిగిన టేకు దుంగలు కొట్టి ఎత్తుకెళ్లారు. ఈ విషయమై రైతులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో మల్యాల మండలంలోని రైతులకు చెందిన టేకు చెట్లను నరికి తీసుకువెళ్లారు. దీంతో మల్యాల పోలీసులు కథలాపూర్ లోని బాధిత రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
వన్యప్రాణులకు ముప్పు
ఓవైపు ప్రభుత్వం వనమహోత్సవం పేరుతో అటవీ సంపదను పెంపొందించే ప్రయత్నం చేస్తుంటే కలప స్మగ్లింగ్ జీవనాధారంగా ఎంచుకున్న కొందరు ఇష్టం వచ్చినట్లు అడవుల నరుకుతున్నారు. దీంతో అడవుల నరికివేత వన్యప్రాణులకు ముప్పుగా మారింది. ఈ క్రమంలో ఆహారం నీరు దొరకక వన్యప్రాణులు సమీప గ్రామాలలోకి వస్తూ వేటగాళ్ల ఉచ్చులో పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో జింకలు, దుప్పులు వంటి వాటిని యువత కాపాడి ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పుతున్నారు. కానీ వెలుగులోకి రాకుండా వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.
కొరవడిన పర్యవేక్షణ.
అటవీ సంపద రక్షణ పట్ల ఫారెస్ట్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫీల్డ్ వర్క్ కు దూరంగా ఉంటూ ఎక్కువ భాగం ఆఫీస్ పనులకే పరిమితమయ్యారన్న వాదనలు లేకపోలేదు. అడవుల నరికివేత వన్యప్రాణుల వేట వంటి తదితర విషయాల్లో ఎవరైనా సమాచారం ఇస్తే తప్ప దాడులు జరపడం లేదన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కథలాపూర్ మండలంలో గతంలో ఓ రెండు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అడవులను ధ్వంసం చేసి భూమి చదును చేశారు. అయితే ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేక చోట్ల జరుగుతున్నాయని అటవీ సంపద రక్షణతో పాటు వన్యప్రాణులు, అటవీ భూముల సంరక్షణకు జిల్లా అధికారులు మరిన్ని పటిష్ట చర్యలు చేపట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ట్రాక్టర్ వదిలి పరారైన నిందితులు
దాదాపు నెల రోజుల క్రితం మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన కొందరు తుర్తి సమీపంలో ట్రాక్టర్లో అక్రమంగా కలపను తరలిస్తుండగా ఫారెస్ట్ ఆఫీసర్లు దాడి చేశారు. అధికారుల రాకను గుర్తించిన స్మగ్లర్లు ట్రాక్టర్ అక్కడే వదిలి పారిపోయారు. ఈ వ్యవహారంలో ట్రాక్టర్ లోడ్ కలప స్వాధీనం చేసుకోగా ట్రాక్టర్ యజమాని నుంచి రూ.లక్ష80వేలు రూపాయలు వసూలు చేసిన నలుగురు ఫారెస్ట్ అధికారులు కేవలం 39 వేలకు మాత్రమే రిసిప్ట్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పట్టుకున్న ట్రాక్టర్ లోడ్ నుంచి కలప దుంగలు సైతం మాయమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. అటవీ సంపదను కాపాడాల్సిన రక్షకులే భక్షకులై డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు గుసగుసలు వినిపించడం స్థానికంగా పెద్ద చర్చకే దారి తీసింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.






