ఇటుక బట్టీల వెనుక బానిస బతుకులు.. ఆ జిల్లాలో100కి పైగా బట్టీలు.. నిబంధనలు నిల్!

by Ramesh Naini |

జిల్లాలో ఇటుక బట్టీల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఒకవైపు వలస కార్మికుల శ్రమను నిలువునా దోచుకుంటున్న నిర్వాహకులు, మరోవైపు పర్యావరణ నిబంధనలకు పాతరేస్తున్నారు.

ఇటుక బట్టీల వెనుక బానిస బతుకులు.. ఆ జిల్లాలో100కి పైగా బట్టీలు.. నిబంధనలు నిల్!
X

దిశ,పెద్దపల్లి: జిల్లాలో ఇటుక బట్టీల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఒకవైపు వలస కార్మికుల శ్రమను నిలువునా దోచుకుంటున్న నిర్వాహకులు, మరోవైపు పర్యావరణ నిబంధనలకు పాతరేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 కి పైగా చిన్న, మధ్య తరహా ఇటుక బట్టీలు కొనసాగుతుండగా వీటిలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని స్థానికులు, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటుక బట్టీల ఏర్పాటుపై కఠిన మార్గదర్శకాలతో కొత్త జీవోను జారీ చేసింది.

వలస కార్మికుల డేటా ఏదీ?

ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు ఏజెంట్ల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి గుంపులుగా వస్తున్న వలస కార్మికులు, వారి కుటుంబాల వివరాలు అధికారికంగా ఎక్కడా నమోదు కావడం లేదు. నిబంధనల ప్రకారం కార్మికులు రాగానే వారి ఆధార్ తదితర వివరాలను కార్మిక, పోలీస్ శాఖలకు అందించాలి. కానీ, బట్టీల నిర్వాహకులు ఈ ప్రక్రియను పూర్తిగా విస్మరిస్తున్నారు.

కనీస సౌకర్యాలు శూన్యం.. పనిగంటల్లో ఉల్లంఘన

బట్టీల వద్ద కార్మికులకు కనీస జీవన సదుపాయాలు కరువయ్యాయి. సురక్షిత తాగునీరు లేక వ్యవసాయ బావులు, బోరు బావిలో నీటినే తాగుతున్నారు. పారిశుధ్యం లేని తాత్కాలిక గుడిసెల్లోనే బతుకీడుస్తున్నారు. చట్ట ప్రకారం రోజుకు 8 గంటలు మాత్రమే పని చేయించాల్సి ఉండగా.. నిర్వాహకులు అదనపు గంటలు పని చేయించుకుంటూ, కనీస వేతనాలు కూడా చెల్లించకుండా తీవ్రంగా దోపిడీ చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు.

బాలల చేతిలో ఇటుకలు

కార్మికుల పిల్లల కోసం ట్యూటర్‌ను నియమించి తాత్కాలిక పాఠశాలలు (వర్క్ సైట్ స్కూల్స్) ఏర్పాటు చేయాలనే నిబంధన కేవలం కాగితాలకే పరిమితమైంది. అధికారులు తనిఖీకి వస్తున్నారంటే బడులు తెరిచి, వెళ్లగానే మూసివేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పసి చేతులు పుస్తకాలకు బదులు ఇటుకలు మోస్తున్నాయి. కార్మిక శాఖలో తగినంత సిబ్బంది లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడి ఈ ఆగడాలు నిరాటంకంగా సాగుతున్నాయి. కార్మికుల హక్కులను కాపాడాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కొత్త నిబంధనలతో నైనా కళ్లెం పడేనా..?

ఒకవైపు కార్మికుల దోపిడీ ఇలా కొనసాగుతుండగా, పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ హైకోర్టు ఆదేశాల మేరకు జీఓ నంబర్ 80 ని విడుదల చేసింది. వాయు కాలుష్య నియంత్రణకు కఠిన మార్గదర్శకాలను అమలులోకి తెచ్చింది.

ఎన్ఓసీ తప్పనిసరి

ఇటుక బట్టీ ఏర్పాటుకు గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ లేదా జిల్లా పరిషత్‌ల నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ కచ్చితంగా తీసుకోవాలి. ఈ నిబంధనలు పాటించే వారికే జిల్లా పరిశ్రమల కేంద్రాలు అనుమతులు ఇస్తాయి. కిలోమీటరు దూరం బట్టీ స్థలం ఎట్టి పరిస్థితుల్లోనూ నివాస ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులకు 1 కిలోమీటర్ లోపు ఉండకూడదు. వ్యవసాయ భూముల నుంచి 50 మీటర్లు, నదీ తీరాల నుంచి 100 మీటర్లు, జాతీయ/రాష్ట్ర రహదారుల నుంచి 200 మీటర్లు, గ్రామ రోడ్ల నుంచి 25 మీటర్ల దూరం పాటించాలి. వ్యవసాయానికి ఇబ్బంది కలగకూడదు. కాలుష్య నియంత్రణ పాటించాలి. దుమ్ము లేవకుండా బట్టీ చుట్టూ రోడ్డుపై ఇటుక ముక్కలతో పూత పోయాలి. ఉత్పత్తి అయ్యే బూడిదను సురక్షితంగా నిర్వీర్యం చేయాలి. ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త ఆదేశాల అమలును ప్రతి జిల్లాలో కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించే బట్టీలపై కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లు కఠిన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల తోనైనా బట్టీల ఆగడాలకు, కార్మికుల దోపిడీకి బ్రేక్ పడుతుందో లేదో వేచి చూడాలి.

Next Story