- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాప్ట్ వేర్ కొలువు వదిలి సర్పంచ్ బరిలో..!
దిశ, జగిత్యాల ప్రతినిధి : ఐటీ కంపెనీల హై లెవెల్ ప్యాకేజీలు పక్కన బెట్టి మరీ

దిశ, జగిత్యాల ప్రతినిధి : ఐటీ కంపెనీల హై లెవెల్ ప్యాకేజీలు పక్కన బెట్టి మరీ గ్రామ సేవకై బరిలోకి దిగుతున్నారు చదువుకున్న మహిళలు. సాఫ్ట్‌వేర్ చైర్ వదిలి సర్పంచ్ కుర్చీపై దృష్టి పెట్టిన ఈ కొత్త తరపు నాయకులు గ్రామీణ రాజకీయాల్లో కొత్త సంచలనానికి నాంది పలుకుతున్నారు. కుటుంబాలు, కంఫర్ట్ జోన్, ఉద్యోగ భద్రత అన్నింటినీ వెనక్కి నెట్టి స్వగ్రామాల అభివృద్దే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వస్తున్న మహిళలు పోటీలో నిలుస్తూ సరికొత్త చర్చకు కేంద్రబిందువుగా మారారు. ఈ ఎన్నికల వాతావరణంలో జిల్లాలో మల్యాల, మేడిపల్లి మాడలాల్లో ఓ ఇద్దరు మహిళా టెకీలు సాఫ్ట్వేర్ కొలువులు వదిలి సర్పంచ్ బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.
లక్షకు పైగా జీతం వదులుకుని
భీమారం మండలం ఈదుల లింగంపేట్ గ్రామానికి చెందిన వెల్మల సుప్రియ బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డారు. నెలకు లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి గ్రామ సేవ కోసం రాజకీయ రంగప్రవేశం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె భర్త వెల్మల హరీష్ రెడ్డి ఎల్ఎల్బీ పూర్తి చేసి బిజినెస్ చేస్తున్నారు. ఈదుల లింగంపేట్ గ్రామానికి ఈ ఎన్నికల్లో జనరల్ మహిళ రిజర్వేషన్ రావడంతో సుప్రియ తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. “గ్రామీణ సమస్యలు దగ్గర నుంచి చూశాను. మౌలిక వసతులు, యువతకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. చదువుకున్న యువత పాలనలోకి రావాలి” అని ఆమె చెబుతున్న మాటలు ఇప్పుడు గ్రామంలో హాట్ టాపిక్‌గా మారాయి.
గ్రామాభివృద్దే ధ్యేయంగా ఐటీ కొలువు వదిలి బరిలోకి..
ఇదే తరహాలో మల్యాల గ్రామానికి చెందిన వీరబత్తిని మాలతి కూడా ఉద్యోగ జీవితాన్ని వదిలి గ్రామ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గతంలో దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేసిన మాలతి, కరోనా సమయంలో స్వదేశానికి వచ్చి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరారు. ప్రస్తుతం అక్కడ నెలకు లక్షకు పైగా జీతం పొందుతున్నారు. మల్యాల గ్రామానికి ఈ ఎన్నికల్లో బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో గ్రామ అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఉద్యోగం వదిలేసి స్వగ్రామానికి వచ్చి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. “గ్రామంలో మంచి నీరు, రోడ్లు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే నా లక్ష్యం” అని మాలతి స్పష్టం చేస్తున్నారు.






