మట్టి మాఫియా అడ్డేది.. చెరువులు కుంటలు, చెట్లను కూల్చి తవ్వకాలు

by Ajay Maddhiboyina |

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యప్తంగా చెరువులు, కుంటలు మట్టి మాఫియా గుప్పిట్లో విధ్వంసానికి గురౌతు వాటి అస్థిత్వాన్ని కోల్పోతున్నాయి. అరికట్టాల్సిన అధికారులు ప్రకృతి సహజ సంపదను ఆదాయవనరుగా మార్చుకుని వ్యాపారం చేస్తున్నారు.

మట్టి మాఫియా అడ్డేది.. చెరువులు కుంటలు, చెట్లను కూల్చి తవ్వకాలు
X

దిశ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యప్తంగా చెరువులు, కుంటలు మట్టి మాఫియా గుప్పిట్లో విధ్వంసానికి గురౌతు వాటి అస్థిత్వాన్ని కోల్పోతున్నాయి. అరికట్టాల్సిన అధికారులు ప్రకృతి సహజ సంపదను ఆదాయవనరుగా మార్చుకుని వ్యాపారం చేస్తున్నారు. ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు కరెన్సీ నోట్లకట్టలకు కక్కుర్తిపడటంతో ఇదే అదనుగా భావిస్తున్న మట్టి మాఫియా చెరువుల్లో కుంటల్లో చెట్లను పీకేసి మట్టిని తవ్వుతూ తరలిస్తున్నారు. నామమాత్రపు అనుమతులు తీసుకుంటున్న మట్టి మాఫియా అక్రమ దందా సాగిస్తున్నారు. దీంతో కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న మాఫియా శాఖల వారిగా సమపాల్లలో డబ్బులు వెదజల్లుతూ దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు.

అధికారులే కీలకంగా అక్రమ దందా

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు రోజు రోజుకూ శృతిమించుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి చట్టాలను అపహాస్యం చేస్తూ అక్రమ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల గండి కొడుతూ యథేచ్ఛగా చెరువులను గుల్ల చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్, పోలీస్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ‘మామూళ్ల’ మాయాజాలం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ మించి,ప్రజా ప్రతినిధులు స్థానిక పంచాయతి పాలకవర్గాల అండదండలు ఈ మాఫియాకు ఉండటంతోనే, వారు అడ్డు అదుపు లేకుండా అక్రమ మట్టి రవాణా సాగిస్తున్నారు అనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి

అనుమతి కొంత.. అక్రమం కొండంతా

​ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా చెరువు లేదా ప్రభుత్వ భూమి నుంచి మట్టిని తరలించాలంటే మైనింగ్, ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి..ఒక క్యూబిక్ మీటర్ మట్టికి ప్రభుత్వానికి సుమారు రూ. 196 నుండి రూ. 300 వరకు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ముందుగానే స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటున్న మట్టి మాఫియా గోరంత అనుమతులు తీసుకుని కొండంత మట్టి తవ్వకాలు చేస్తూ రవాణా సాగిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారుల్లో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది . అనుమతి లభించిన తర్వాత ఇరిగేషన్ అధికారులు సదరు చెరువులో మార్కింగ్ చేయాల్సి ఉంటుంది ఎంత లోతు తీయాలి, ఏ పరిధిలో తీయాలనేది పర్యవేక్షించాల్సి ఉంటుంది ఈ నిబంధనలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి . ఒక ట్రాక్టర్ లేదా లారీ మట్టికి అనుమతి తీసుకుని, దానికి వంద రెట్లు (100x) అధికంగా మట్టిని తోడేస్తున్నారు. జేసీబీలు, పొక్లెయిన్లతో పగలు, రాత్రి తేడా లేకుండా చెరువుల సహజరూపాన్ని చెరిపేస్తున్నారు ...

ఒక్కో ట్రిప్పుకు రూ. 5,000!

​చెరువుల్లో అక్రమంగా మట్టిని తోడుతున్న మట్టి మాఫియా

ఈ చెరువు మట్టిని ప్రధానంగా ఇటుక బట్టీల వ్యాపారానికి తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పరిసర ప్రాంతాల్లోని ఇటుక బట్టీల నిర్వాహకులతో మట్టి మాఫియా భారీ డీల్స్ కుదుర్చుకుని తరలిస్తున్నారు. ​చెరువులోనే లారీ లేదా టిప్పర్‌ను లోడ్ చేసి ఇచ్చినందుకు గాను ఇటుక బట్టీల యజమానులు ఒక్కో ట్రిప్పుకు రూ. 4,500 నుంచి రూ. 5,000 వరకు చెల్లిస్తున్నారు.​రోజుకు వందలాది ట్రిప్పులు తరలుతుండటంతో, మాఫియా రోజువారి టర్నోవర్ లక్షల్లో సాగుతోంది. నెల తిరిగేసరికి కోట్ల రూపాయల ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి చేరుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ ఆదాయం మాత్రం నామమాత్రంగా ఉంటుందీ జిల్లా వ్యప్తంగా .గ్రామాలవారీగా సాగుతున్న దోపిడీ పర్వం పై స్థానికంగా వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయి

వాల్టా చట్టం ఉల్లంఘిస్తున్న కానరాని చర్యలు

​చెట్లను పీకేస్తూ గుట్టలు చెరువులను తవ్వేస్తూ ఫారెస్ట్ ల్యాండ్ సైతం గుళ్లా చేయడం ​దోపిడీకి పరాకాష్టగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగుతున్న అక్రమ దందా చాలా ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు చేపడుతు తరలిస్తున్నారు అనే విమర్శలు సైతం ఉన్నాయి. అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారుల నుంచి అనుమతులు లేకుండానే, ఇష్టారాజ్యంగా చెట్లను నరికివేసి మరీ మట్టిని తవ్వేస్తున్నారు . పచ్చని చెట్లను కూల్చివేసి, ప్రకృతిని ధ్వంసం చేస్తూ మట్టిని కాజేస్తున్నా అటవీ శాఖ అధికారులు అటువైపు కన్నేత్తిచూడకపోవడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. మట్టి మాఫియా అడ్డూ అదుపు లేకుండా వ్యవహరించడంతో . చెరువులు, కుంటలు రూపురేఖలు కోల్పోతున్నాయి. తవ్వకాల వల్ల చెరువుల ఉనికి ప్రమాదంలో పడటమే కాకుండా, వర్షాకాలంలో నీరు నిలిచే సామర్థ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

​ప్రజాప్రతినిధులకు ‘రేట్ ఫిక్స్’ దందా

అక్రమ దందా సాగిస్తున్న మట్టి మాఫియాకు అధికారపార్టి నేతల అండదండలు ఉండటంతో మాకు ఆ ప్రజాప్రతినిధి అండ ఉంది.. మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి!"..​అంటూ ఈ అక్రమ తవ్వకాలపై స్థానిక గ్రామస్తులు, పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తే మాఫియా ముఠాలు ఇచ్చే సమాధానం . ​మాకు నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఆయన అనుచరులకు ఇందులో వాటాలు ఉన్నాయి. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. మీ ఇష్టం వచ్చిన కాడికి పోయి చెప్పుకోండి, కలెక్టర్‌కు చెప్పుకున్నా మా వెంట్రుక కూడా పీకలేరు’అంటూ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.​ గ్రామాల్లో ప్రశ్నించే గొంతులను బెదిరింపులతో, రాజకీయ బలంతో నొక్కేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.​. మట్టి దోపిడీ సజావుగా సాగడానికి ఒక నిర్దిష్టమైన ‘సిండికేట్’ వ్యవస్థ పనిచేస్తోందని స్పష్టంగా అర్థమవుతుంది .

అక్రమ దందాలో ఎవరి వాటా వారిదే

అక్రమ మట్టి దందా సాగిస్తున్న మట్టి మాఫియా

స్థానిక పోలీస్ స్టేషన్, రెవెన్యూ ఆర్ఐ తహసీల్దార్ , మైనింగ్, ఇరిగేషన్ శాఖల కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు ‘మామూళ్లు’ అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే లారీల శబ్దం వినిపిస్తున్నా అధికారులు అవి ఏమీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏ చెరువు తవ్వాలన్నా, ఏ ప్రాంతం నుంచి మట్టిని లేపాలన్నా ముందుగా స్థానిక ప్రజాప్రతినిధి లేదా నియోజకవర్గంలో ప్రముఖ నాయకుడి ముఖ్య అనుచరుడి వద్ద ‘రేట్ ఫిక్స్’ చేసుకోవాలనే నిబంధనను మాఫియా అమలు చేస్తుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా వారికి కొంత మొత్తం ముట్టజెప్పితేనే ఆ ప్రాంతంలో జేసీబీలు దిగడానికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది.​ ​ఈ అక్రమ మట్టి తవ్వకాల వల్ల జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాల మట్టం పడిపోయే ప్రమాదం ఉంది అని స్థానికంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి . నిబంధనలకు విరుద్ధంగా చెరువు కట్టల సమీపంలో, విపరీతమైన లోతుకు తవ్వడం వల్ల రాబోయే వర్షాకాలంలో కట్టలు తెగిపోయే ప్రమాదం కూడ ఉంది.

​టిప్పర్ల రవాణా తో రోడ్ల ధ్వంసం

భారీ లోడుతో వెళ్లే లారీలు, టిప్పర్ల వల్ల గ్రామీణ ప్రాంత రోడ్లు పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారుతున్నాయి. దీనివల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతూ సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.మట్టి లారీలు రద్దీ రోడ్లపై వేగంగా నడపడం వల్ల గ్రామాలు, రోడ్ల పక్కన ఉన్న ఇళ్లు దుమ్ము ధూళి తో పేరుకుపోతున్నాయి. ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతూ ఆరోగ్యాలు ప్రమాదకరంగా తయారవుతున్నాయి

​ఇప్పటికైనా అక్రమ దందాలు ఆగేనా?

​రాష్ట్ర వ్యాప్తంగా సహజ వనరుల రక్షణపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. స్థానిక అధికారులందరూ మాఫియాతో చేతులు కలపడంతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మరియు మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story