జగిత్యాల మున్సిపల్ చైర్ ప‌ర్స‌న్ గా సమిండ్ల వాణి

by Ratna Kumari |

జగిత్యాల మున్సిపల్ చైర్‌ పర్సన్‌గా సమిండ్ల వాణి ఎన్నికయ్యారు. ఈ నాటకీయ పరిణామంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన పంతం నెగ్గించుకున్నారు.

జగిత్యాల మున్సిపల్  చైర్ ప‌ర్స‌న్ గా సమిండ్ల వాణి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : నాటకీయ పరిణామాల మధ్య జగిత్యాల మున్సిపాలిటీ చైర్ పర్సన్ పీఠం చివరకు ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ వర్గానికే దక్కింది. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సమిండ్ల వాణి ఎన్నికయ్యారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన పంతం నెగ్గించుకున్నారు. మొదటి నుంచి చైర్‌పర్సన్ సీటు పై పట్టుదలగా ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి ఈసారి కూడా నిరాశే మిగిలింది. అయితే సమతుల్యం కోసం వైస్ చైర్మన్ పదవి జీవన్ రెడ్డి వర్గానికి దక్కింది. వారి వర్గానికి చెందిన జీనత్ ఫర్విన్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 50 వార్డులున్న జగిత్యాల మున్సిపాలిటీలో 23 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అదనంగా బీజేపీ రెబల్ కౌన్సిలర్లు ముగ్గురు, ఎంఐఎం ఇద్దరు, ఇండిపెండెంట్లు కలిసి మొత్తం 39 మంది కౌన్సిలర్లు సమిండ్ల వాణికి మద్దతు ప్రకటించడం కీలకంగా మారింది. దీంతో చైర్‌పర్సన్ పదవి స్పష్టమైన మెజారిటీతో ఎమ్మెల్యే వర్గానికి దక్కింది. ఇక బీజేపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు సభ్యులు, అలాగే కాంగ్రెస్ కౌన్సిలర్ అడువాల జ్యోతి తటస్థంగా ఉన్నారు. ఆది నుంచే వివాదాస్పదంగా మారిన జగిత్యాల మున్సిపల్ వ్యవహారంలో చివరకు చైర్‌పర్సన్ పదవి ఎమ్మెల్యే వర్గానికి, వైస్ చైర్మన్ పదవి జీవన్ రెడ్డి వర్గానికి దక్కడం ద్వారా అంతర్గత వర్గపోరుకు తాత్కాలిక ముగింపు పలికినట్టయింది. భవిష్యత్‌లో ఈ సమీకరణాలు ఎలా మారుతాయ‌నేది వేచి చూడాలి.

Next Story