నకిలీ విత్తు.. రైతు చిత్తు

by Ajay Maddhiboyina |

ఖరీఫ్ సీజన్ ప్రారంభంతోనే గ్రామాల్లో నకిలీ పత్తి, మొక్కజొన్న విత్తనాల అమ్మకాలు విజృంభిస్తున్నాయి. తక్కువ ధర, ఎక్కువ దిగుబడి పేరుతో రైతులను నమ్మించి లక్షల రూపాయలు కొల్లగొట్టేందుకు ఈ ముఠాలు పన్నాగం పన్నుతున్నాయి.

నకిలీ విత్తు.. రైతు చిత్తు
X

దిశ, హుజూరాబాద్ : ఖరీఫ్ సీజన్ ప్రారంభంతోనే గ్రామాల్లో నకిలీ పత్తి, మొక్కజొన్న విత్తనాల అమ్మకాలు విజృంభిస్తున్నాయి. తక్కువ ధర, ఎక్కువ దిగుబడి పేరుతో రైతులను నమ్మించి లక్షల రూపాయలు కొల్లగొట్టేందుకు ఈ ముఠాలు పన్నాగం పన్నుతున్నాయి. అమాయక రైతులు వీధి బారిన పడి మోసపోయిన సంఘటనలు గతంలో చాలా ఉన్నా మళ్ళీ మళ్ళీ అవే పునరా వృతం అవుతున్నాయి. ఎక్కువగా మెట్ట ప్రాంతాలైన సైదాపూర్,చిగురుమామిడి, శంకరపట్నం,భీమదేవరపల్లి, హుస్నాబాద్, ఎల్కతుర్తి ప్రాంతాల్లో ఈ నకిలీ విత్తనాల అమ్మకం కొనసాగించే ముఠా ఇప్పటికే విత్తనాలను గ్రామాలకు రహస్యంగా పంపినట్లు సమాచారం. గ్రామాల్లోని కొందరు రైతులను పరిచయం చేసుకొని వారి ద్వారా అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇదే అదునుగా ఫర్టిలైజర్ షాపుల యజమానుల సైతం నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతూ అందులో అందిప కాడికి దండుకుంటున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తూ తనిఖీల మాట మరిచిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నెల, నెల మామూళ్లకు ఇచ్చినంత ప్రాధాన్యత తనిఖీలకు ఇవ్వకపోవడంతో ఫర్టిలైజర్ షాపులో యజమానులు నిబంధనలు మరిచి యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

ఎలా మోసం చేస్తున్నారు..?

నకిలీ విత్తనాల ముఠాలు ప్రధానంగా మూడు రకాలుగా రైతులను మోసం చేస్తున్నాయి. మొదటిది, పాత, గడువు ముగిసిన విత్తనాలను కొత్త ప్యాకెట్లలో రీ-ప్యాకింగ్ చేసి అమ్మడం. రెండోది, సాధారణ విత్తనాలకు రసాయనాలు పూసి బీటీ పత్తి, హైబ్రిడ్ మొక్కజొన్న అని చెప్పి అధిక ధరకు విక్రయించడం. మూడోది, గ్రామాల్లో తాత్కాలిక షెడ్లు, మొబైల్ వ్యాన్ల ద్వారా బిల్లు లేకుండా అమ్మి వెంటనే పారిపోవడం జరుగుతుందని పేర్కొంటున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరగడంతో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు వీరిపై నిఘా పెట్టి కేసులు నమోదు చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ దందా ప్రతి సీజన్లో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న,పత్తి విత్తనాలు వేసే సమయం లోనే ఈ దందా కొనసాగుతుంది. సీజన్ అయిపోవడంతో ఎక్కడి వారు అక్కడే అన్నట్లు మాయం అయిపోతారు. విత్తనాలు వేశాక తగిన జర్మినేషన్ రాగా, మొలిచిన విత్తనాలు సరైన పంట దిగుబడి ఇవ్వక రైతులు నష్టపోయి అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు గతంలో ఉన్నాయి. కమాండ్ ఏరియాలో ఎక్కువగా సీడ్ పంటలపైనే ఆధారపడి ఉండడం మూలంగా ఇక్కడ నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉండదు. దీంతో మీరు ప్రధానంగా మెట్ట ప్రాంతాలపైనే కన్నేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

పెరుగుతున్న ఫిర్యాదులు..

తెలంగాణలో గత నెలలోనే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో 45కి పైగా నకిలీ విత్తనాల కేసులు నమోదయ్యి. రైతులు వేసిన నకిలీ పత్తి విత్తనం 10 రోజుల్లో మొలకెత్తకపోవడం, మొక్కజొన్న పంటలో పురుగు తీవ్రంగా ఆశించడంతో పెట్టుబడి మొత్తం నష్టపోతున్నారు. అప్పటికే సమయం మించిపోవడంతో రైతులు మళ్లీ పంటలు వేసి అవకాశాలు లేక వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పెట్టిన పెట్టుబడి నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ ప్రతి జిల్లాలో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది.అసలైన విత్తన ప్యాకెట్‌పై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి “సీడ్ ట్రేసబిలిటీ” యాప్ ద్వారా అసలైనదా, నకిలీదా అని వెంటనే చెక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.సీడ్ యాక్ట్ 1966 ప్రకారం నకిలీ విత్తనం అమ్మితే 3 ఏళ్ల జైలు, 50 వేల జరిమానా విధించే అవకాశం ఉంది.

అధికారుల హెచ్చరిక..

“రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లు లేకుండా విత్తనం కొనవద్దు. లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరే కొనుగోలు చేయాలి. అనుమానం వస్తే వెంటనే మండల వ్యవసాయాధికారికి లేదా 1800-180-1551 కిసాన్ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలి” అని తెలంగాణ వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. సీజన్ మొదలైన ఈ సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండి విత్తనాల కొనుగోలు చేయాలని, లైసెన్సు ఉన్న షాపుల్లోనే కొనుగోలు చేస్తే రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉండదని అంటున్నారు.రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు పెంచాలని, నకిలీ విత్తనాల ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రకటనలకే పరిమితమైన అధికారులు

ఫర్టిలైజర్ షాపులు, నకిలీ విత్తనాలు అమ్మే దొంగల ముఠా గ్రామాల్లో చొరబడి విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగిస్తున్నప్పటికి అధికారులు విత్తనాలు కొనే విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని ప్రకటనలు చేయడం తప్ప తనిఖీలు చేయాలనే విషయాన్ని మరిచి కార్యాలయంలో సేద తీరుతున్నారు. ఈ విషయంపై పలుమార్లు ఆరోపణలు వచ్చినప్పటికీ వారు తమ మామూలు ఎక్కడ పోతాయో అనే బెంగతో తనిఖీ విషయం మరిచిపోతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని షాపుల తో పాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన డంపులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story