పోలీస్ అమ‌ర‌వీరుల త్యాగాల చిర‌స్మ‌ర‌ణీయం

by Ratna Kumari |

శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి జ్ఞాపకార్థం నిర్మించిన బ్యారక్ సిబ్బందికి స్ఫూర్తినిస్తుందని పోలీస్ కమిషనర్ గౌస్ అలాం పేర్కొన్నారు.

పోలీస్ అమ‌ర‌వీరుల త్యాగాల చిర‌స్మ‌ర‌ణీయం
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి జ్ఞాపకార్థం నిర్మించిన బ్యారక్ సిబ్బందికి స్ఫూర్తినిస్తుందని పోలీస్ కమిషనర్ గౌస్ అలాం పేర్కొన్నారు. బుధవారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన ‘పోలీస్ అమరవీరుల స్మారక బ్యారెక్’ ను ఆయన ప్రారంభించారు. ​ఈ సందర్భంగా సిపి మీడియాతో మాట్లాడుతూ.. ​​విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల గౌరవార్థం ఈ బ్యారక్‌ను నిర్మించినట్లు తెలిపారు. అత్యంత తక్కువ సమయంలో నాణ్యమైన వసతులతో దీనిని పూర్తి చేశామన్నారు. పోలీస్ సిబ్బంది వసతి, సంక్షేమానికి ఈ భవనం ఎంతగానో దోహదపడుతుందని ఆకాంక్షించారు.నిర్మాణంలో చొరవ చూపిన హుజూరాబాద్ ఏసీపీ మాధవి, టౌన్ ఎస్‌హెచ్‌ఓ కరుణాకర్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

​సొంత భవనాల్లోకి పోలీస్ స్టేషన్లు

అద్దె భవనాల్లో కొనసాగుతున్న పోలీస్ స్టేషన్ల నిర్మాణంపై దృష్టి పెట్టామని, ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని సీపీ వెల్లడించారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయిందని, త్వరలోనే శాంతిభద్రతల కోసం అత్యాధునిక పోలీస్ భవనాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

ట్రాఫిక్ సమస్యపై స్పష్టత

హుజురాబాద్ ​పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు హోంగార్డులతో తాత్కాలిక ఏర్పాట్లు చేశామని సీపీ తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రతిపాదనలు లేవని, కొత్త హైవే నిర్మాణం పూర్తయిన తర్వాత ట్రాఫిక్ రద్దీని బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు.​ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి, సీఐలు కరుణాకర్, బొల్ల బత్తిని శ్రీనివాస్, రామకృష్ణ గౌడ్, హుజురాబాద్ సబ్ డివిజన్ లోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story