- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీవ్ యువ వికాసం: యువత ఆశలు అడియాసలేనా?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది

దిశ, చొప్పదండి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. చొప్పదండి మండల పరిధిలోని యువత ఈ పథకం ద్వారా ఉపాధి పొందవచ్చనే కొండంత ఆశతో కులాల వారిగా తమకు అనుకూల రంగాల్లో ఆన్లైన్లోదరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం తొలుత దరఖాస్తుదారు సిబిల్ స్కోరు ఆధారంగా పథకం వర్తింపునకు యూనిట్లను మంజూరు చేయాలని భావించి తరువాత అభ్యంతరాలు వ్యక్తమైన తరుణంలో సిబిల్ స్కోర్ నిబంధనలు ఎత్తివేసింది. ఉపాధికి మార్గం సులభతరమైందని భావించిన యువతకు నిరాశ ఎదురైంది. ప్రభుత్వం బ్యాంకు రుణాలతో పాటు కొంత సబ్సిడీ అందించనుండడంతో యువత ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదుగుదామనుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆర్థిక సాయం మంజూరు చేస్తారని భావించినా ఇప్పటికీ పథకం అమలు కాక పోవడంతో యువతకు ఉపాధి లేక కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో యువకులు నిరుత్సాహానికి గురవుతున్నారు.ప్రభుత్వం గత ఏడాది రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాయితీ రుణాల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తామని ప్రకటించి చివరి నిమిషంలో వాయిదా వేసింది. సబ్సిడీ రుణాల పంపిణీపై సందిగ్ధత వీడాలని, ఉపాధి కల్పించి తమ జీవితాల్లో వెలుగులు నిపంపడానికి రాజీవ్ యువవికాసం పథకం అమలు పరచాలని ఉపాధి నిరుద్యోగ యువత కోరుతోంది.
నిరుద్యోగ యువత ఎదురు చూపులు
స్వయం ఉపాధి పథకం కోసం లబ్ధిదారులు ఆన్లైన్ లో నమోదు చేసుకున్న దరఖాస్తులను సంబంధిత పంచాయతీలు, మున్సిపాలిటీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యేలు సూచనలు పాటించిన జాబితా ఆధారంగా జిల్లా, మండల స్థాయి కమిటీలు లబ్ధిదారుల ఎంపిక కసరత్తు చేసినట్లు సమాచారం. కాగా ఈ ప్రక్రియను ముందుకు వెళ్లకుండా నిలిపివేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో రుణాల మంజూరు ఆగిపోయింది. దీంతో యువతలో ఆందోళనలు మొదలై ఎప్పుడు పథకం ప్రారంభమవుతోందోనని ఎదురు చూస్తున్నారు.
ఉపాధి లేని యువతపై తీవ్ర ప్రభావాలు
ఉద్యోగం, ఉపాధి లేక యువత వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటుంది. కుటుంబ ఆర్థిక వ్యవస్థపై పలు చెడు ప్రభావాలు చూపుతున్నాయి.ఇంటి, వైద్య ఖర్చులు భరించలేకపోవడం వల్ల నిరుద్యోగ యువత కష్టాల్లో పడుతోంది. తద్వారా నిరాశతో మానసిక ఒత్తిడికి గురవుతూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చెడు వ్యసనాల వైపు అడుగులు పడుతున్నాయి. ఉపాధి లేక ఖాళీ సమయం వల్ల చెడు వ్యసనాలైన మాదకద్రవ్యాలు, జూదం, సైబర్ నేరాల వంటి దుష్ప్రవర్తనలకు బానిసలవుతున్నారు. డిగ్రీ లు చదివిన ఉపాధి, ఉద్యోగం లేకపోవడంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి చదివించిన తల్లిదండ్రులకు అప్పులు పెరిగి ఆర్థికంగా చతికిలపడి ఎన్నో కుటుంబాలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాయి.
పీజీ పూర్తి చేసి ఉపాధి లేక ఖాళీగా ఉన్నా
రాజీవ్ యువ వికాసం పథకంలో స్వయం ఉపాధి పొందాలని రూ. 4 లక్షల రుణ సహాయంతో పాడిపరిశ్రమ స్థాపన యూనిట్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేశాను. ప్రభుత్వం రుణం మంజూరి చేస్తే ఉపాధి ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటాను. ప్రస్తుతం పీజీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాను. - నాగపురి రవి, చాకుంట
నిరుద్యోగ సమస్యను రూపుమాపి, యువతకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ప్రారంభించిన రాజీవ్ యువ శక్తి పథకం నేడు యువతీ యువకుల స్వయం ఉపాధి ఆశలను అడియాసలు చేస్తూ ఒక నిష్ప్రయోజన పథకంగా మారడం అత్యంత విచారకరం.యువతలో ఆశలు రేకెత్తించి, దరఖాస్తుల పేరుతో వారిని ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి చివరకు చేతులెత్తేసింది బ్యాంక్ రుణాల అనుసంధానం వంటి కీలక అంశాలపై ఏమాత్రం శ్రద్ధ చూపకుండా పథకాన్ని అటకెక్కించడం అంటే యువతను నిలువునా మోసం చేయడమేనని ప్రభుత్వం గ్రహించాలి.- సింగిరెడ్డి కృష్ణారెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు






