జగిత్యాల మహా బతుకమ్మ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం?

by velandi.Saikiran |

జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మహా బతుకమ్మ వేడుకలలో ప్రోటోకాల్ వివాదం తలెత్తినట్లుగా

జగిత్యాల మహా బతుకమ్మ వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం?
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మహా బతుకమ్మ వేడుకలలో ప్రోటోకాల్ వివాదం తలెత్తినట్లుగా తెలుస్తోంది. వేడుకలలో భాగంగా వచ్చిన అతిథులకు ఇచ్చిన మెమొంటోలపై కలెక్టర్ సత్యప్రసాద్ ఫోటో పెట్టలేదు. మున్సిపల్ కమిషనర్ స్పందన, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ ఫోటోలతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధుల ఫోటోలను ఏర్పాటు చేశారు. అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకల్లో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఫోటో పెట్టకపోవడం పట్ల అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి.

అయితే ఇది కాకతాళియంగా జరిగిన పొరపాటా? లేక ఉద్దేశపూర్వకంగానే చేసారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫోటోను మెమొంటోపై చిన్న సైజులో పెట్టడం పట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ బతుకమ్మ వేడుకలకు హాజరైన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ స్పందన తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ప్రోటోకాల్ లోపం మున్సిపల్ అధికారుల బాధ్యత రాహిత్యాన్ని ఎండగడుతుండగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story