- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయటపడ్డ ఆదిమానవుల రాతి చిత్రాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నెవారిపల్లి గ్రామ శివారులోని గొర్రెగండి మైసమ్మ గుట్టలో సుమారు పదివేల సంవత్సరాల నాటి ఆదిమానవుల రాతి చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.

దిశ, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నెవారిపల్లి గ్రామ శివారులోని గొర్రెగండి మైసమ్మ గుట్టలో సుమారు పదివేల సంవత్సరాల నాటి ఆదిమానవుల రాతి చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ అడవుల్లో సముద్ర జీవులను పోలిన రాతి చిత్రాలను గుర్తించిన మట్టి ఫౌండేషన్ బృందం, ఈసారి ఆస్ట్రేలియా, టాస్మేనియా, న్యూగినియా ప్రాంతాల్లో మాత్రమే కనిపించే కంగారూ, ఎకిడ్నా (ముళ్ల బల్లి) వంటి జంతువులను పోలిన చిత్రాలను గుర్తించడం విశేషంగా నిలిచింది. గుట్ట దిగువన ఉన్న మైసమ్మ గండి వద్ద పాత రాతియుగం, సూక్ష్మ రాతియుగ కాలానికి చెందిన రాతి పనిముట్లు కూడా లభించాయి. తూర్పు ముఖంగా ఉన్న రాక్ షెల్టర్‌లో ఎరుపు, ముదురు ఎరుపు రంగులతో గీసిన అనేక రాతి చిత్రాలు బయటపడ్డాయి. వీటిలో ప్రధానంగా కంగారూ ఆకారాన్ని పోలిన పొడవాటి తోక కలిగిన జంతువు, ఒళ్లంతా ముళ్లతో ఉన్న ఎకిడ్నా, బల్లి, పాము, తాబేలు, గుర్రం లేదా గాడిదలను పోలిన చిత్రాలు కనిపించాయి. అలాగే చేయి పైకెత్తకుండా ఒకే నిరంతర రేఖతో గీసిన ఐదు కోణాల నక్షత్రాలు, వృత్తాకార ఆకృతులు, ఇతర సంకేత చిత్రాలు కూడా గుర్తించారు.ఈ చిత్రాలు మధ్య శిలాయుగం ప్రారంభం నుంచి నవీన శిలాయుగం వరకు చెందినవిగా భావిస్తున్నారు.
మానవ వలసల చరిత్రలో ఇది అత్యంత కీలకం
తొలి దశ చిత్రాలు సుమారు క్రీ.పూ. 10,000 సంవత్సరాల నాటివి, తరువాత గీసిన కొన్ని చిత్రాలు క్రీ.పూ. 5,000 సంవత్సరాల నాటివి అయి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. గుహ సమీపంలో రాతి పనిముట్లను నూరేందుకు ఉపయోగించినట్లు భావిస్తున్న గ్రూవ్స్ (రాపిడి గుర్తులు), అలాగే రంగుల తయారీకి ఉపయోగించే హెమటైట్ (ఇనుప ఖనిజం) రాళ్లు కూడా లభించాయి. సమీపంలోని నక్కవాగు తీరంలో సూక్ష్మ రాతియుగ పనిముట్లు గుర్తించడం ఈ ప్రాంత ప్రాచీనతను మరింత బలపరుస్తోందని బృందం తెలిపింది.గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కంగారూను పోలిన రాతి చిత్రాలు గుర్తించినప్పటికీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి చిత్రాలు లభించడం విశేషమని రెడ్డి రత్నాకర్ రెడ్డి పేర్కొన్నారు. పురావస్తు శాఖ శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఇవి నిజంగా కంగారూ, ఎకిడ్నా చిత్రాలేనని నిర్ధారిస్తే, మానవ వలసల చరిత్రలో ఇది అత్యంత కీలకమైన ఆవిష్కరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం స్థానికులు ఈ ప్రాంతాన్ని మైసమ్మ దేవత స్థలంగా పూజిస్తున్నారు. గతంలో తంగల్లపల్లి మండలం లచ్చపేట గుట్టపై ఉన్న రాతి చిత్రాలకు సున్నం వేయడంతో అవి దెబ్బతిన్న నేపథ్యంలో, గన్నెవారిపల్లి రాతి చిత్రాలను కూడా అదే ప్రమాదం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం, పురావస్తు శాఖ తక్షణ చర్యలు తీసుకుని సంరక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్నతనంలో మా తాత చిత్రల గురించి వివరించేవాడు. చిన్నతనంలో బర్రెలు, ఆవులను మేపడానికి ఈ గుట్ట ప్రాంతానికి వచ్చేవాడిని. అప్పుడే ఇక్కడ ఉన్న రాతి చిత్రాలను మా తాత నాకు చూపించి, ఇవి చాలా పురాతనమైన ఆదిమానవుల చిత్రాలని వివరించేవారు. అప్పట్లో వాటి ప్రాముఖ్యత నాకు పూర్తిగా తెలియదు.
గ్రామస్తుడు,కరికే బాబు (సేవాలాల్ తండా):గ్రామంలో పురాతన చిత్రలు వెలుగులోకి రావడం గర్వకారణం
గన్నెవారిపల్లి శివారులో ఇంత విలువైన చారిత్రక రాతి చిత్రాలు వెలుగులోకి రావడం మా గ్రామానికి గర్వకారణం. ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయిలో ఉన్న ఈ వారసత్వ సంపదను ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఈ చిత్రాలు దెబ్బతినకుండా గన్నెవారిపల్లి గుట్టకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం
గ్రామ యువకుడు, కరికే మహేష్ (సేవాలాల్ తండా):చరితాత్మక సంపద కాపాడుకోవాలి
గన్నేవారిపల్లె గ్రామ శివారులో పురాతన కాలానికి చెందిన ఆదిమానవుల శిలా చిత్రాలు లభించడం సంతోషకరమని ఈ చిత్రాలు మన ప్రాంత చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తాయి.ఈ అరుదైన పురావస్తు ఆనవాళ్లను గుర్తించి, వాటి పరిరక్షణ కోసం పురావస్తు శాఖ అధికారులు వెంటనే స్పందించి శాస్త్రీయ పరిశీలన చేపట్టాలి.
సెక్రటరీ నరేందర్ రెడ్డి, గన్నేవారిపల్లె






