- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాల కాంగ్రెస్‌లో ‘పదవుల’ సెగ.. సీనియర్లు వర్సెస్ వలస నేతలు
జగిత్యాల కాంగ్రెస్‌లో పదవుల సెగ! సీనియర్లు వర్సెస్ వలస నేతలు. సీఎం రేవంత్ రెడ్డి భేటీ వాయిదా.. పెరుగుతున్న అసంతృప్తి.

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు మళ్లీ కాక రేపుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్ కుమార్-మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య విభేదాలతో వేడెక్కిన రాజకీయ వాతావరణం, ఇప్పుడు నామినేటెడ్ పదవుల కేటాయింపులతో మరింత ఉద్రిక్తంగా మారింది. సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామాతో పార్టీ ఒక్కసారిగా కుదేలవ్వగా తాజాగా కో-ఆప్షన్ పదవుల కోసం నేతల మధ్య ఆధిపత్య పోరు తెరపైకి రావడం కలకలం రేపుతోంది. ఒకవైపు సీనియర్ లీడర్లు తమకే పదవులు కట్టబెట్టాలని మంత్రి అడ్లూరి వద్ద ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యే పదవుల్లో తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చగా భవిష్యత్ రాజకీయాలపై అనిశ్చితి నెలకొంది.
పదవుల కోసం లాబీయింగ్ జోరు
మున్సిపల్‌లో కో-ఆప్షన్ పదవుల కోసం లాబీయింగ్‌లు జోరందుకున్నాయి. పదవుల కోసం ఆశావాహులు ప్రభావవంతమైన నేతలను కలుస్తూ తమ అవకాశాలను బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మంత్రి, ఎమ్మెల్యే, పార్టీ ముఖ్య నేతల చుట్టూ తిరుగుతూ వర్గ బలం, రాజకీయ పట్టును చూపించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరి సిఫార్సు బలంగా ఉంటే వారికి పదవి ఖాయం అవుతుందనే భావనతో అంతర్గత పోటీ మరింత ఉత్కంఠ రేపుతోంది. కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కో-ఆప్షన్ పోస్టుల భర్తీ త్వరలోనే జరుగుతుందన్న సంకేతాలతో లాబీయింగ్ మరింత వేడెక్కింది.
సీనియర్ల ఆవేదన.. వలస నేతలకు ప్రాధాన్యం?
సీనియర్ నేతల్లో అసంతృప్తి వెల్లివిరుస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తానని ప్రకటించిన జగిత్యాల ఎమ్మెల్యేపై, పార్టీలో తన అనుచరులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏండ్లుగా పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలను పక్కనపెట్టి, తనకు సన్నిహితంగా ఉన్న వారికి కో-ఆప్షన్ పదవులు కేటాయించే ప్రయత్నం జరుగుతోందన్న చర్చలు కాంగ్రెస్ వర్గాల్లోనే సాగుతున్నాయి. ఎమ్మెల్యే కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీని వీడారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు సీనియర్ నాయకులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేయాలని, తగిన గుర్తింపు కల్పించాలని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
సీఎం హామీ...అపాయింట్మెంట్ రద్దు...డీసీసీ క్లారిటీ
జగిత్యాలలో నామినేటెడ్ పదవుల విషయంలో పార్టీకి సర్వీస్ చేసిన సీనియర్ నేతలకు అండగా నిలుస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చినట్లు సమాచారం. సీనియర్లకు సీఎం రేవంత్ రెడ్డి ని కలిసేందుకు సోమవారం సాయంత్రం అపాయింట్మెంట్ కూడా ఇప్పిచ్చినట్లు తెలుస్తుంది. కాగా నాయకులు హైదరాబాద్ ప్రయాణానికి సిద్ధమయ్యారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ అపాయింట్మెంట్ రద్దు కావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఇప్పటికే జరగాల్సిన కీలక సమావేశం కూడా హైదరాబాద్‌లో ఓ ముఖ్య నాయకుడి జోక్యం తో వాయిదా పడినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో స్థానిక నేతల్లో అసంతృప్తి తీవ్రరూపం దాల్చుతోంది.అయితే ఇతరత్రా కార్యక్రమాల కారణంగానే సీఎం అప్పాయింట్మెంట్ రద్దయిందని మరో రోజు సీనియర్ లీడర్లను సీఎం కచ్చితంగా కలుస్తారని డీసీసీ ప్రెసిడెంట్ నందయ్య క్లారిటీ ఇచ్చారు.
అటు జీవన్ రాజీనామా..ఇటు పదవుల పంచాయతీ..!
పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన కొద్ది రోజుల్లోనే కో ఆప్షన్ పదవుల విషయం తెరపైకి రావడం వాటిలోనూ వలస లీడర్లకే ప్రయారిటీ ఇస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టే జీవన్ రెడ్డి వెంట వెళ్లలేదని కొందరు బాహాటంగానే చెబుతున్నారు. కో ఆప్షన్ తో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ను సీనియర్ నాయకులు తెరపైకి తెస్తున్నారు. కాగా ఇప్పటికే వర్గపోరు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, అధిష్టానం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంది.






