పేదల ఇళ్ల‌కు స్థలాలు కేటాయించాలి

by Ratna Kumari |

పేదల ఇళ్ల‌కు స్థలాలు ప్రభుత్వం కేటాయించాలని, పేదల ఇండ్లు కట్టుకోకుండా సింగరేణి యాజమాన్యం అడ్డుకోవడం సరికాదని మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.

పేదల ఇళ్ల‌కు స్థలాలు కేటాయించాలి
X

దిశ, గోదావరిఖని : పేదల ఇళ్ల‌కు స్థలాలు ప్రభుత్వం కేటాయించాలని, పేదల ఇండ్లు కట్టుకోకుండా సింగరేణి యాజమాన్యం అడ్డుకోవడం సరికాదని మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. శనివారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు జరుగుతున్న దీక్షను సందర్శించిన నాయకులు, కాలనీవాసుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు చిలుక ప్రసాద్, కనుకుంట్ల రమేష్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేదలు నివాస గృహాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జీఎం ఆఫీస్ వెనుక ఉన్న ప్రభుత్వ భూమిలో నివాస గృహాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే, సింగరేణి యాజమాన్యం, కొంతమంది ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టించడం అన్యాయమని విమర్శించారు.


ఇంతకాలంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వినతులు సమర్పించినప్పటికీ అధికారులు స్పందించకపోవడం దళితుల పట్ల వారి నిర్లక్ష్యాన్ని చూపుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, మేయర్ ఇచ్చిన హామీల ప్రకారం “ఇందిరమ్మ ఇండ్లు” పథకం కిందనైనా గృహాలు లేని పేదలకు నివాస స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మంద కొమరమ్మ కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో మరింత ఉద్ధృతమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మామిడి స్వామి, మామిడి పెళ్లి శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు పరాసపల్లి రవికుమార్, కన్నూరి ధర్మేందర్, పల్లె బాబు, మంద రవికుమార్, గద్దల అనిల్, మాతంగి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story