ఆన్ లైన్ బెట్టింగ్.. నిండు ప్రాణం బలి..

by Bhanu |   (  Updated:2025-06-09 15:37:42  IST  )

ఆన్ లైన్ బెట్టింగ్ ఓ యువకుడి నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఆన్ లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడిని తల్లిదండ్రులు మందలించడంతో అవమాన భారంతో చివరికి తాను మోసపోయానని భావించి బలవన్మరణానికి పాల్పడ్డాడు..

ఆన్ లైన్ బెట్టింగ్.. నిండు ప్రాణం బలి..
X

దిశ, తంగళ్లపల్లి : ఆన్ లైన్ బెట్టింగ్ ఓ యువకుడి నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఆన్ లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడిని తల్లిదండ్రులు మందలించడంతో అవమాన భారంతో చివరికి తాను మోసపోయానని భావించి బలవన్మరణానికి పాల్పడ్డాడు..తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. రాజన్న సిరిసిల్ల తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) అనే యువకుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి కార్ మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నాడు.


గత మూడేళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ పెడుతూ గేమ్స్ ఆడుతున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ వల్ల సుమారు పది లక్షల వరకు పోగొట్టుకున్నాడు. దీంతోపాటు స్నేహితుల వద్ద కూడా అప్పులు చేసి ఆన్లైన్ గేమ్ లో పెట్టుబడిగా పెట్టి కోల్పోయాడు. ఈ విషయం కాస్త ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు వంశీని మందలించారు. ఓవైపు డబ్బులు కోల్పోవడం, మరోవైపు తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో ఇక తన డబ్బులు చేతికి రావాలని ఆందోళనతో మనస్థాపం చెందిన వంశీ చివరికి గ్రామ శివారులోని తన పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


కుమారుడి మరణం కల్లారా చూసిన ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. యువకుడి ఆత్మహత్య దేశాయిపల్లి గ్రామంలో తీవ్రవిషాదం నింపింది. తండ్రి తుమ్మల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు.

Next Story