- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రారంభం సరే..ప్రయాణమేదీ?
ఆరంభం ఆర్భాటం.. ఫలితం శూన్యం.

దిశ, గన్నేరువరం: సరైన రోడ్డు సదుపాయం లేక గన్నేరువరం మండలానికి చేరుకోవడానికి నానా పాట్లు పడుతున్న మండల ప్రజలు, ఇతర జిల్లాల ప్రజలు మానేరు నదిపై బోటు ఏర్పాటుతో తక్కువ సమయంలో వ్యయ ప్రయాస లేకుండా మైలారం గ్రామానికి అటు నుంచి మండల కేంద్రానికి చేరుకోవచ్చు అన్న ఆశలు అడియాశలు అయ్యాయి. కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి మైలారం మల్లికార్జున స్వామి జాతర భక్తుల కోసం బోటును ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లికార్జున స్వామి జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తారని వారికి ఇబ్బంది కలగకుండా బోటును ప్రారంభిస్తున్నామని బాహాటంగా తెలిపారు. అయితే ఈ బోటు ప్రారంభోత్సవానికే పరిమితమైంది. ఈనెల 16, 17, 18 తేదీలలో మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు రోడ్డు మార్గం ద్వారానే నానా తంటాలు పడుతూ మైలారం చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
బోటు ఎందుకు నడవలేదు...?
ఈ నెల 12వ తేదీన ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయ బాలకిషన్ బోటును ప్రారంభించినప్పటికీ మరి బోటు సౌకర్యం కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధి చూపించలేదా, ప్రారంభోత్సవం చేసిన నాయకులు బోటు ఏర్పాటుపై దృష్టి సారించలేదా అని మండల ప్రజలు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ బోటు ప్రయాణానికి ఏదైనా అడ్డంకి ఉంటే ముందు వెనక ఆలోచించకుండా సరైన ఏర్పాట్లు చేయకుండా ప్రారంభోత్సవం చేయడం ఏంటని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అటు బిఆర్ఎస్ ఇటు కాంగ్రెస్
మైలారం మల్లికార్జున స్వామి జాతరకు మండల ప్రజలకు జిల్లా కేంద్రం నుండి తక్కువ సమయంలో భక్తులు చేరుకోవడానికి మానేరు జలాలలో బోటును ఏర్పాటు చేస్తున్నామని మండల కాంగ్రెస్ నాయకులు ట్రయల్ రన్ నిర్వహించామని ప్రచారం చేసుకోగా బిఆర్ఎస్ నాయకులు ఏకంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసామని ప్రచారం చేశారు. బోటు మాత్రం నడవలేదు ఇరు పార్టీలు భక్తుల మండల ప్రజల మన్నన పొందడానికి ప్రయత్నాలు మాత్రం జోరుగా చేశారు. ఆరంభ శురత్వమే కానీ ఆచరణ కరువు అన్న చందంగా ఉన్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాప్రతినిధులు మాట నిలబెట్టుకోవాలి
మండల ప్రజల సౌకర్యార్థం బోటు ఏర్పాటు చేస్తున్నామని ట్రయల్ రన్ నిర్వహించిన నాయకులు చిత్తశుద్ధితో బోటును ఏర్పాటు చేయాలి. మండల ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచాలి. దీనితోపాటు మానేరు జలాలలో బోటు ప్రయాణానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా సరైన రక్షణ చర్యలు చేపట్టి బోటు ప్రయాణాన్ని ఇప్పటికైనా ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.






