వామ్మో పులి.. చిక్కదు...దొరకదు!

by Thanuru Gopichand |

అడవిలో ఉండాల్సిన పులి ఇప్పుడు గ్రామాల మధ్య తిరుగుతోంది. అదిగో పులి ఇదిగో పులి అంటూ వారం రోజులుగా రామగుండం పరిసర గ్రామాల్లో భయం రాజ్యమేలుతోంది.

వామ్మో పులి..  చిక్కదు...దొరకదు!
X

దిశ, గోదావరిఖని : అడవిలో ఉండాల్సిన పులి ఇప్పుడు గ్రామాల మధ్య తిరుగుతోంది. అదిగో పులి ఇదిగో పులి అంటూ వారం రోజులుగా రామగుండం పరిసర గ్రామాల్లో భయం రాజ్యమేలుతోంది. పొలాల వైపు వెళ్లాలంటే ప్రజలు వణుకుతున్నారు. పిల్లలను బయటకు పంపాలంటే భయమేస్తుందని అక్కడికి వచ్చిన అధికారులను గ్రామ ప్రజలు నిలదీస్తున్నారు. వారం రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గ్రామీణులు పడుతున్న పరిస్థితి. పులి అడుగుజాడలు కనిపిస్తున్నాయని, రాత్రివేళ పశువులపై దాడి చేసేలా సంచరిస్తోందని ప్రత్యక్షంగా చూసిన ప్రజలు, గ్రామస్తులు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పాద ముద్రలు గుర్తించి ట్రాకింగ్ చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పులిని గుర్తించిన ఆనవాళ్లు వారికి దొరకడం లేదు. అయినా ఫారెస్ట్ శాఖ అధికారులు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. శోధన లేదు, పహారా లేదు, ప్రజలకు భరోసా లేదు.

నిర్లక్ష్యం ఎందుకు?

వారం రోజులు గడిచినా పులి ఆచూకీ తేల్చడంలో అటవీ అధికారులు విఫలమయ్యారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?” అని నిలదీస్తున్నారు. పిల్లలు, రైతులు, కూలీలు భయంతో బతుకుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, బడి వెళ్లే చిన్నారులు, కూలీ పనులకు వెళ్లే మహిళలు అందరూ భయంతోనే బయట అడుగు పెడుతున్నారు. రాత్రి అయితే గ్రామాలన్నీ తాళాలు వేసుకుని గుబురుగా కూర్చుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. గత అయిదు రోజుల క్రితం శ్రీరాంపూర్ ఓసీపీ పరిసర ప్రాంతం నుంచి మూసివేసిన మేడిపల్లి ఓసీపీ-4 ప్రాంతంలోకి గోదావరి నది దాటి ఓ పులి వచ్చింది. నది పరిసర ప్రాంతాల్లో పులి తిరిగిన ఆనవాళ్లు కనిపించాయి. మేడిపల్లి ఓసీపీ మూసివేయడంతో అక్కడున్న సీసీ కెమెరాలను సింగరేణి సంస్థ తొలగించింది. దీంతో ఈ పులిని ఎవరన్నా చూసి చెబితే తప్పా ప్రత్యక్షంగా కెమెరాల్లో రికార్డులు లేవు. కేవలం పులి అడుగులను నిర్ధారించిన ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతంలో పులి సంచరిస్తుందని చెబుతున్నారు.

చర్యలు ఎప్పుడు?

పులిని పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు, గస్తీ బృందాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫారెస్ట్, ఉన్నతాధికారులు ఇలా నిర్లక్ష్యం చేస్తే పెద్ద పులి దాడిలో ప్రాణాలు పోతే ఎవరు జవాబు చెబుతారు? అని గ్రామాల ప్రజల ఆవేదన చెందుతున్నారు. పులి ప్రజలకు కనబడితే దానిపై దాడులు చేయరాదని అలా చేస్తే చట్టప్రకారం చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

ప్రజల డిమాండ్

వెంటనే పులి కోసం గాలింపు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో రాత్రి పహారా ప్రజలకు భద్రతపై స్పష్టమైన హామీ అధికారులు ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story