వివాదస్పదంగా మారిన కేక్ కట్టింగ్

by Bhanu |   (  Updated:2025-06-20 13:45:44  IST  )

ఒకవేళ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే.. ఎదురయ్యే దృశ్యం? స్పెషల్ ఆఫీసర్ టేబుల్ పైనే కేక్ కటింగ్

వివాదస్పదంగా మారిన కేక్ కట్టింగ్
X

దిశ, బ్యూరో కరీంనగర్ : ఒకవేళ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే.. ఎదురయ్యే దృశ్యం? స్పెషల్ ఆఫీసర్ టేబుల్ పైనే కేక్ కటింగ్… సిబ్బందంతా ఫోటోలు దిగుతూ సెల్ఫీలకు పోటాపోటీగా ఫోజులు.. ఇది సినిమా సెట్ కాదు సార్, కరీంనగర్ జిల్లా రూరల్ మండల కార్యాలయం..!


అవును, ఎప్పుడూ "ఫైళ్ల" గుండా కష్టాలు దాటే కార్యాలయం ఇప్పుడు "కేక్"ల మజిలీగా మారింది. సూపరింటెండెంట్ సంపత్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కార్యాలయంలో కేక్ కట్ చేయడమే కాక, స్పెషల్ ఆఫీసర్ టేబుల్‌ను డైనింగ్ టేబుల్‌గా మార్చేశారు..! ‘‘ఏం బాబోయ్‌..! ఇదేం పాలనో..!’’ అంటూ.. దీనిపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు..

కార్యాలయం కాదు… సెలబ్రేషన్ హాల్..!

ఫైల్ క్లోజ్ చేసే చేతులు ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాయి. పౌరసేవలపై ఫోకస్ ఉండాల్సిన అధికారులు ఇప్పుడు ఫోటోషూట్లలో బిజీగా ఉన్నారు. ఆఫీస్ వద్దకి వచ్చిన ప్రజలు సమస్యల పరిష్కారాల కంటే సెలబ్రేషన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉందనే అర్ధం చేసుకుంటూ వెనుదిరుగుతున్నారు.

సూపరింటెండెంట్ బర్త్ డే – జిల్లా హాట్ టాపిక్..!

ఇందిరమ్మ ఇళ్ల పనులు బిజీగా కొనసాగుతుంటే, అందులో పాల్గొనాల్సిన వారు బర్త్‌డే బిజీలో ఉండటం వల్ల ప్రజలకు మరోసారి నిరాశే మిగిలింది. పనులపై దృష్టి పడకపోవడం ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తోంది.


సాక్షాత్తూ ఆర్డీవో స్థాయి అధికారి కార్యాలయం చూస్తున్నా… పర్యవేక్షణకు కొలమానం సున్నా. ఇక ప్రశ్న ఎవరి మీదనూ కాదు.. కేక్ మీదే..! పైగా జనం కూడా ‘‘మా సమస్యల పరిష్కారం కోసం అధికారులను వెతికితే.. వాళ్లు కేక్ తింటున్నారు.’’ అని వాపోతున్నారు.

ఇక చివరగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో కేక్ కట్ కాకుండా, కచ్చితంగా పని జరగాలని కోరుతున్న ప్రజలు ఒక గొప్ప సూచన ఇస్తున్నారు “కేక్ బయట కట్ చేయండి… ప్రజా సమస్యలు లోపల కట్ చేయండి!”

కేక్ వేడుకల నడుమ ప్రజా సమస్యలు పుట్టినరోజు కేకులోనే పడి పోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల అభివృద్ధికి ఇక చాక్లెట్ కవర్లతో ప్రణాళికలు రచించాల్సిన పరిస్థితి రావచ్చేమో..!

Next Story