స్థంబంపల్లిలో సంచ‌ల‌నం.. వెలుగు చూసిన నాగ‌దేవ‌త విగ్ర‌హం

by Ratna Kumari |

జ‌గిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి సంచలనం చోటు చేసుకుంది.

స్థంబంపల్లిలో సంచ‌ల‌నం.. వెలుగు చూసిన నాగ‌దేవ‌త విగ్ర‌హం
X

దిశ, వెల్గటూర్ : జ‌గిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి సంచలనం చోటు చేసుకుంది. స్తంభంపల్లి గ్రామంపై ఉన్న గుట్టపై నాగ దేవత విగ్రహం వెలుగు చూడడంతో గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. దీంతో తండో తండాలుగా తరలివచ్చి నాగదేవతకు అభిషేకాలు, పూజలు చేస్తున్నారు. గత మూడు రోజులుగా గ్రామానికి చెందిన పోడేటి తిరుపతి అనే వ్యక్తికి ఎల్లమ్మ తల్లి కల‌లో కనిపించి గ్రామ‌స్తులు ప‌ట్టించుకోవ‌డం లేదు.. ఎందుకు..? విస్మ‌రిస్తున్నారంటూ పేర్కొన్న‌ట్టు స‌మ‌చారం.

"నేను ఎల్ల‌మ్మ‌ను గుడి వ‌ద్ద తాటి వ‌నంలో పుట్ట‌లో పూజ‌లు, అభిషేకాల‌కు దూరంగా ఉంటున్నాను. ఇది మీ గ్రామానికి మంచిది కాదు" అని క‌ల‌లో చెప్ప‌డంతో తిరుప‌తి తో పాటు కొంత మంది వ్య‌క్తులు క‌లిసి ఇద్ద‌రు సిద్ధాంతుల‌ను తీసుకొచ్చి రెండు రోజుల కింద‌ట ఎల్ల‌మ్మ గుడి వ‌ద్ద పూజ‌లు జ‌రిపించారు. ఎలాంటి ఫ‌లితం రాలేదు. మ‌రో ఇద్ద‌రు సిద్ధాంతుల‌ను తీసుకొచ్చి గ్రామంలోని ఎల్ల‌మ్మ గుడి వ‌ద్ద ఆదివారం పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలోని మహిళలు ఎల్లమ్మ గుడి వద్ద పూజలు నిర్వహించి బోనం తీసుకొని ఊరికి వెనుక భాగంలో ఉన్న పోచమ్మ గుడి వద్దకు వెళ్లి బోనం సమర్పించి అమ్మవారికి 101 బిందెల నీటితో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ సిద్ధాంతులు కొంతమంది గ్రామస్తులు కలిసి పోచమ్మ గుడి నుంచి గుట్ట పైకి కొంత దూరం వెళ్లారు. అక్కడ ఉన్న పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పుట్ట లోపల నుంచి చిన్న సైజులో ఉండే బంగారు నాగ దేవత విగ్రహంతో పాటు ఒక గొడుగును సిద్ధాంతులు వెలికి తీశారు. జన సమక్షంలోనే సహజ సిద్ధంగా వెలుగు చూసిన నాగ దేవత విగ్రహాన్ని చూడటానికి ఊరంతా కదిలి వచ్చింది. పుట్టలో నుంచి వెలువడిన నాగ దేవత విగ్రహాలను ప్రస్తుతానికి ఆ సిద్ధాంతుల సమక్షంలోనే గ్రామంలో భద్రపరిచారు. ఆ త‌రువాత‌ ఎలాంటి పూజలు చేపట్టాలని గ్రామస్తులంతా కలిసి ఒక నిర్ణయానికి రాబోతున్నట్లు సమాచారం. అలాగే నాగదేవతకు వీలైనంత త్వరగా గుడి కట్టి పూజలు చేయాలని గ్రామస్తులు యోచిస్తున్నారు.

Next Story