ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోవర్టు రాజకీయాలు మానుకోవాలి

by Nallavelli.Anjaneyulu |

జగిత్యాల బీజేపీలో కోవర్టు వ్యవహారాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా స్పందించారు. పార్టీలో ఉన్న కోవర్టుల కారణంగానే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం లేదని ఆయన అన్నారు.

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోవర్టు రాజకీయాలు మానుకోవాలి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల బీజేపీలో కోవర్టు వ్యవహారాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా స్పందించారు. పార్టీలో ఉన్న కోవర్టుల కారణంగానే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం లేదని ఆయన అన్నారు. కోవర్టు రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆయన, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగ శ్రావణి ఇంటి పై పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేతలు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్నవారు పార్టీలోనే ఉన్న కోవర్టులేనని ఆరోపించిన అరవింద్, ఇలాంటి నాయకులను పార్టీ నుంచి తప్పకుండా బయటకు పంపుతామని హెచ్చరించారు.


మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై కూడా విమర్శలు గుప్పించారు. కోవర్టు రాజకీయాలు మానుకోవాలని ఆయనకు హితవు పలికారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. భోగ శ్రావణి ఉదాహరణను ప్రస్తావిస్తూ ఆమె పార్టీ మారేటప్పుడు తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిందని చెప్పారు. ఒక మహిళ అయిన ఆమెను చూసి ఎమ్మెల్యే నేర్చుకోవాలని సూచించారు. కేంద్రియ విద్యాలయం కు పది ఎకరాల భూమి కేటాయించడంలో ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది ఉందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒప్పించి అయినా కేంద్రియ విద్యాలయం కోసం భూమి కేటాయింపును సాధించాలని అన్నారు. ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ అరవింద్ మండిపడ్డారు.

Next Story