రేపు రుద్రంగిలో పర్యటించనున్న మంత్రి పొంగులేటి .. ఏర్పాట్లు పరిశీలించిన ఆది శ్రీనివాస్

by Bhanu |

రెవెన్యూ, హౌసింగ్ ఐ&పి.ఆర్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు.

రేపు రుద్రంగిలో పర్యటించనున్న మంత్రి పొంగులేటి .. ఏర్పాట్లు పరిశీలించిన ఆది శ్రీనివాస్
X

దిశ, రుద్రంగి : రెవెన్యూ, హౌసింగ్ ఐ&పి.ఆర్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే లతో కలిసి చేయాల్సిన ఏర్పాట్ల పై విప్ గురువారం రుద్రంగి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం భూ భారతి చట్టం ముందస్తుగా 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద నిర్వహించామని, ప్రస్తుతం ప్రతి జిల్లాలో ఒక మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగి భూ భారతి చట్టం ద్వారా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

గతంలో ప్రభుత్వ భూములు వ్యవసాయ చేస్తున్న పేదలకు, దళితులు గిరిజనులకు అసైన్డ్ పట్టాలు, పోడు భూముల పట్టాలు పంపిణీ చేశామని గుర్తు చేశారు. గత ధరణి చట్టం సమయంలో అసైన్మెంట్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ధరణి వ్యవస్థతో పేదలకు అనేక ఇబ్బందులు వచ్చాయని, సమస్యల పరిష్కారానికి రూల్స్ తీసుకుని రాలేదని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీ మేరకు నూతనంగా భూ భారతి చట్టం రూల్స్ తో సహా ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అధ్యక్షుడిగా అసైన్మెంట్ కమిటీలను కూడా ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని విప్ తెలిపారు.

అసైన్మెంట్ కమిటీల ద్వారా ప్రభుత్వ భూములలో సాగు చేసుకుంటూ పట్టాలు రాని అర్హులు ఎవరైనా ఉంటే వారికి తప్పనిసరిగా అందజేస్తామని ప్రకటించారు. రుద్రంగి మండల కేంద్రానికి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వస్తారని తెలిపారు. రుద్రంగి మండలంలో మంజూరైన 243 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం కూడా హౌసింగ్ శాఖ మంత్రి చేతులమీదుగా జరుగుతుందని తెలిపారు. రుద్రంగిలో ఇంటి కోసం పేదలు చేసుకున్న దరఖాస్తులు ఇంకా ఏమైనా పెండింగ్ లో ఉంటే వెంటనే మంజూరు చేయాలని జిల్లా ఉన్నతాధికారులను విప్ ఆదేశించారు.

అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ,

భూ భారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన వంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుద్రంగి లో పర్యటించనున్నారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసే ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు. రుద్రంగి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహణకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని, సంబంధిత ప్రజా ప్రతినిధులను ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు సూచించారు.

రెవెన్యూ సదస్సుల వద్ద పారిశుధ్య నిర్వహణ, లైటింగ్ మొదలగు ఏర్పాట్లను ఎంపీడీవో పకడ్బందీగా పూర్తి చేయాలని, హెలిపాడ్ వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని, టెంట్, కుర్చీలు , సభా వేదిక వంటి ఏర్పాట్లను ఆర్ అండ్ బి అధికారి పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. త్రి పర్యటన నేపథ్యంలో అంబులెన్స్ అందుబాటులో పెట్టాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సమావేశం వద్ద ఫైర్ ఇంజన్ అందుబాటులో పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు పోసి ప్రారంభించే కార్యక్రమ ఇంటి స్థలాలు, హెలిపాడ్, బహిరంగ సభా వేదిక, రెవెన్యూ సదస్సులు జరిగే సభ వేదిక, గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూభారతి సహాయ కేంద్రం వంటివి పరిశీలించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.రాధాబాయ్ , రుద్రంగి తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీవో నటరాజ్, ఈఈ ఆర్ & బీ వెంకట రమణయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ హౌసింగ్ శంకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Next Story