రోళ్ల ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అడ్లూరి..

by Kodari Anjali |

రోళ్ల వాగు ప్రాజెక్టు అటవీ శాఖ అనుమతులు పూర్తి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

రోళ్ల ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అడ్లూరి..
X

దిశ, బీర్ పూర్: జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలోని రోళ్ల వాగు ప్రాజెక్టు సంబంధించిన అటవీశాఖ అనుమతులు పూర్తి చేసి ఈ వానకాలం సీజన్‌లో సాగు నీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తో పాటు నీటిపారుదల శాఖ అటవీ శాఖ అధికారులతో కలిసి రోళ్లవాగు ప్రాజెక్టును మంత్రి సందర్శించారు. అనంతరం బీర్పూర్ లక్ష్మణ స్వామిని దర్శించుకుని మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేసే క్రమంలో డీపీఆర్ పూర్తి అయిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం చేస్తారని అన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోళ్లవాగు ప్రాజెక్టుకు ఏలాంటి డీపీఆర్ లేకుండానే పనులు ప్రారంభించారని మంత్రి అడ్లూరి ఆరోపించారు.

ప్రభుత్వం నిర్మాణ సంస్థకు...

2016లో ఏలాంటి అనుమతులు లేకుండా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పనులు ప్రారంభించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రూ. 60 కోట్లతో ప్రారంభించిన రోళ్ల వాగు ప్రాజెక్టు 2023 డిసెంబర్ వరకు రూ. 153 కోట్లకు పెంచారని అన్నారు. అంచనాలు పెంచినప్పటికీ రోళ్ల వాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకున్నారని ధర్మపురి నియోజకవర్గ ప్రాజెక్టులను మాత్రం పెండింగ్ లో పెట్టారని మంత్రి అడ్లూరి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోళ్ల వాగు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి అన్నదాతలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్మాణ సంస్థకు ఇవ్వాల్సిన రూ. 40కోట్లు చెల్లించడంతో పాటు రెవెన్యూకు సంబంధించిన 800 ఎకరాల భూమిని అప్పగించడం జరిగిందని మంత్రి వివరించారు. రిజర్వు ఫారెస్ట్ అనుమతుల కోసం రూ. 32 లక్షలు డిపాజిట్ చేయడం జరిగిందని మంత్రి వివరించారు. రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులతో పాటు అటవీ శాఖ అనుమతులు సాధించి ఈ వానకాలంలో సాగునీటిని రైతులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

యుద్ధ ప్రాతిపాదికన గేట్ల బిగింపు చేపట్టి...

15 రోజుల్లో ప్రాజెక్టుకు గేట్లు బిగించి పాయింట్.25 టీఎంసీల నీటిని నిలువ చేసి రైతులకు వానకాలం సీజన్‌లో సాగు నీటిని అందిస్తామని మంత్రి తెలిపారు. రోళ్లవాగు ప్రాజెక్టు కాల్వ లైనింగ్ పనులకు అంచనాలు తయారు చేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. యుద్ధ ప్రాతిపాదికన గేట్ల బిగింపు చేపట్టి రైతులకు సాగునీటిని అందించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ దినేష్ ,డీఎఫ్ఓ రవికుమార్, బీర్పూర్ సర్పంచ్ హరీష్, కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాల రామచంద్ర రావు, ఆర్డీవో మధుసూదన్, డిఎంహెచ్వో సుజాత, ఎమ్మార్వో సుజాత, ఎస్సై సబ్బాని రాజు, రాజగోపాల్ రావు, అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అంగన్వాడీలు, అశాలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Next Story