ఉపాధి పనిలో సౌకర్యాలు కరువు

by Pulgam srinivas |

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు పని కల్పించడమే ధ్యేయంగా ప్రవేశ పెట్టిన వికసిత్ భారత్ రోజ్గార్ హామీ మిషన్ (విబిజి రామ్ జి) పథకం పనులు ప్రారంభమయ్యాయి.

ఉపాధి పనిలో సౌకర్యాలు కరువు
X

దిశ, చొప్పదండి : కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు పని కల్పించడమే ధ్యేయంగా ప్రవేశ పెట్టిన వికసిత్ భారత్ రోజ్గార్ హామీ మిషన్ (విబిజి రామ్ జి) పథకం పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అధికారులు పని కల్పిస్తారు. సంవత్సరానికి 125 రోజులు కూలీలకు పని కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, చెరువుల పూడిక వంటి అభివృద్ధి పనులు చేసి అటు గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయడం, ఇటు ప్రజల జీవనోపాధి మెరుగు పరచడం ముఖ్య ఉద్దేశ్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు గుర్తించిన పని ప్రదేశాలకు కూలీలను తరలించి పని కల్పించే భాద్యతలు ఫీల్డ్ అసిస్టెంట్ లు నిర్వర్థిస్తున్నారు. వీరు కూలీలకు నిర్ణిత కొలతలో పని చేయిస్తారు. రోజువారి కూలీల హాజరు మస్టర్ లు నమోదు చేసి 15 రోజులకు ఒకసారి కూలీ చెల్లింపుల కోసం సంబంధిత అధికారులకు అందజెస్తారు. ఈ సమయంలో ప్రభుత్వం కూలీలపై భారం పడకుండా పలు ఏర్పాట్లను కల్పిస్తుంది. కానీ పని ప్రారంభమై రోజులు గడుస్తున్న అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. ఈ మేరకు చొప్పదండి మండల పరిధిలోని కొలిమికుంట, కాట్నపల్లిలో వీబీజీ రామ్ జి పథకంలో భాగంగా అధికారులు గ్రామ ప్రజలకు పని కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయగా శ్రీ గట్టు మల్లిఖార్జున స్వామి దేవాలయ రోడ్డు పనులు జరుగుతున్నాయి. జాబ్ కార్డు కలిగిన కూలీలకు ఎలాంటి రుసుం లేకుండా ప్రభుత్వం పంపిణి చేసే తట్టలు, పారలు, గడ్డపారలు వంటి పనిముట్లు ఉచితంగా అందించాలని కోరుతున్నారు. పనిచేస్తున్న ప్రదేశాల్లో కూలీలకు మంచినీరు అందించడం లేదని తెలుపుతున్నారు. భోజన సమయాల్లో భోజనం చేసేందుకు నీడ, తాగేందుకు మంచినీళ్ల సౌకర్యాలు కల్పించడంలేదు. సమీపంలోని చెట్ల నీడలో భోజన కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. రోజు రోజుకు వేసవి ఉష్ణగ్రతలు పెరుగుతున్నప్పటికి కూలీల భద్రతలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఎండవేడిమితో ఆశ్వస్థతకు గురైనప్పుడు అందించాల్సిన ఓఆర్ఎస్ ద్రావణలు అందుబాటులో ఉంచడంలేదు. గడ్డపార, పార, తట్టల వంటి పనిముట్లతో పనులు చేస్తున్న సందర్భంలో గాయపడ్డ కూలీలకు అందించే ప్రథమ చికిత్స మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాల్సి ఉండగా సదుపాయాలు కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయడం లేదు. నెల క్రితం పనులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా ఉన్నతాధికారులు పని ప్రాంతాల్లో పర్యటించడంలేదు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి సమస్యలు తీర్చాలని కూలీలు కోరుతున్నారు.

కార్యదర్శులకు సర్క్యులర్ జారిచేస్తాం

రాజయ్య, అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్, చొప్పదండి

మండల అభివృద్ధి అధికారి అనుమతితో వారి ఆదేశాల మేరకు వీబీజీ రామ్ జి పథకంలో పనిచేసే కూలీలకు నీడ,నీళ్లు వంటి సౌకర్యాలు కల్పించేందుకు మండలంలోని సమస్త గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సర్క్యులర్ జారీ చేస్తాం. ఆశా వర్కర్ల ద్వారా మెడిసిన్,ఓఆర్ఎస్ ద్రావణలు అందుబాటులో ఉంచుతాం. కూలీలకు పనిముట్లు అందించేందుకు ఎలాంటి ఆదేశాలు లేవు. ఉన్నతాధికారుల నుంచి ఇవ్వాలని ఆదేశాలు వస్తే అందరికి అందజేస్తాం. కూలీల డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటాం.

Next Story