- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ లో కర్మకాండ నిలయాలు
కరీంనగర్ లో చాలా చోట్ల కిరాయి ఇండ్లలో నివసిస్తున్న కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి అంత్యక్రియలు ముగిసేంత వరకు ఇంటి యజమానులు రానివ్వని దుస్థితి నెలకొంది.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : కరీంనగర్ లో చాలా చోట్ల కిరాయి ఇండ్లలో నివసిస్తున్న కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి అంత్యక్రియలు ముగిసేంత వరకు ఇంటి యజమానులు రానివ్వని దుస్థితి నెలకొంది. అసలే సొంత ఇల్లు లేని పేదలకు లాడ్జీల్లో బస చేసేంత ఆర్ధిక స్తోమత ఉండదు. అట్లాగని ఇంట్లోకి వెళ్లలేరు. కొంత మంది బంధువుల ఇళ్ల వద్దకు వెళితే... కొంతమంది కర్మకాండ ముగిసే వరకు స్మశాన వాటికల్లో భార్యాపిల్లలతో బతుకు వెళ్లదీయాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి హృదయ విదారక మానవీయ కథనాలు వార్తా పత్రికల్లో నిత్యం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై కరీంనగర్ లో ఎవరూ ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానికి సూచించారు.
కరీంనగర్ లో నాలుగు దిక్కుల 4 కర్మకాండ నిలయాలను నిర్మించి అందుబాటులోకి తేవాలని కోరారు. స్మశాన వాటికలకు సమీపంలో ఈ కర్మకాండ నిలయాలను నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి సూచన మేరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు వారం రోజుల క్రితం కరీంనగర్ లోని సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, హైదరాబాద్, వరంగల్ రహదారుల్లో ఉన్న స్మశాన వాటికలను సందర్శించారు. ఆయా స్మశాన వాటికల సమీపంలో కర్మకాండ నిలయాలు నిర్మాణానికి అనువైన స్థలాలపై ఆరా తీశారు. మార్కండేయ నగర్ స్మశాన వాటిక, కరీంనగర్ ఓల్డ్ సిటీ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని స్మశాన వాటిక, అల్కాపురి స్మశాన వాటిక సమీపం, జగిత్యాల రోడ్డులోని రేకుర్తి స్మశాన వాటిక, మంచిర్యాల రోడ్డులోని స్మశాన వాటికల సమీప స్థలాలను పరిశీలించారు.
స్థలాల ఎంపిక పూర్తయితే జీ+1 పేరిట కరీంనగర్ నలు దిక్కుల 4 కర్మకాండ నిలయాలను నిర్మించాలని నిర్ణయించారు. కరీంనగర్ కార్పొరేషన్ లో నిధుల కొరత లేనందున సాధ్యమైనంత తొందర్లో స్థలాలను ఎంపిక పనులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో కర్మకాండ నిలయానికి రూ.50 లక్షల చొప్పున వ్యయం చేయాలని భావిస్తున్నారు. కరెంట్, నీటి వసతి, బస చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఈ కర్మకాండ నిలయాల్లో కల్పించనున్నారు. ఈ కర్మకాండ నిలయాలు అందుబాటులోకి వస్తే కిరాయి ఇళ్లల్లో నివసిస్తున్న కుటుంబాలకు ఊరట కలగనుంది. కుటుంబ సభ్యులు చనిపోయిన నాటి నుంచి కర్మకాండలు ముగిసే వరకు గరిష్టంగా 13 రోజులపాటు కర్మకాండ నిలయాల్లో ఆశ్రయం పొందవచ్చు. ఉచితంగా ఆశ్రయం కల్పించడంకంటే కిరాయిదారులపై భారం పడకుండా నామమాత్రం రుసుం చెల్లించేలా ఫీజు నిర్ణయించాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ సందర్భంగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ లో నలు దిక్కుల 4 కర్మకాండ నిలయాలను నిర్మించి ఆశ్రయం కల్పించాలనే ప్రతి పాదనలను రూపొందించినట్లు తెలిపారు. త్వరలోనే స్థలాల ఎంపికను పూర్తి చేసి కర్మకాండ నిలయ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.






