మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల జోరు

by Kodari Anjali |

పేదల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు పెద్దల దగ్గర సాగిల పడుతున్నారు.

మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల జోరు
X

దిశ, శేరిలింగంపల్లి: పేదల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు పెద్దల దగ్గర సాగిల పడుతున్నారు. అక్రమ నిర్మాణాలు నిరోధించి ప్రణాళిక బద్ధంగా కాలనీల నిర్మాణం జరిగేలా పర్యవేక్షించాల్సిన కనీస బాధ్యత మాదాపూర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మర్చిపోతున్నట్లు ఉంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో జోరుగా సాగుతున్న అక్రమ కట్టడాలు చూస్తే నిజమనిపిస్తుంది.కాసులకు కక్కుర్తి పడి బాధ్యతలు మర్చిపోయారు. విధుల నుంచి తప్పించుకోవడానికి నాన్న అక్కచాట్లు పడుతున్నారు. ఇందుకోసం పచ్చి అబద్ధాలు ఆడేందుకు వెనుకాడడం లేదు. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్న సామెత చందంగా వ్యవహరిస్తూ తమకు సంక్రమించిన అధికారాలను బిల్డర్ల దగ్గర తాకట్టు పెడుతున్నారు. మాదాపూర్ సర్కిల్ అధికారుల వ్యవహార శైలి హైటెక్ సిటీ లో చర్చనీయాంశం అయ్యింది. అయ్యప్ప సొసైటీలో నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఉండవు అన్న సంగతి అందరికీ తెలుసు. కాని అక్కడ ఆక్రమ నిర్మాణాలు జరిగిపోతున్నాయి.అంతటితో సంతృప్తి చెందని నిర్మాణదారులు ఏకంగా రోడ్ల ఆక్రమించి ఏడు,ఎనిమిది అంతస్తులు భవనాలు నిర్మిస్తున్నారు.

మాదాపూర్ ప్రత్యేక సర్కిల్‌గా ఏర్పాటు...

ఈ నిర్మాణాలపై గత ఐదు నెలలుగా అనేక ఫిర్యాదులు వచ్చిన స్పందించలేదు. 20 అడుగుల రోడ్డులో హై రైజ్డ్ భవనాలు నిర్మిస్తున్నారు. ఆ తరువాత వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తారు. లేదంటే అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటారు. అనుమతులు లేని భవనాలకు ఫైర్ ఎన్ ఓ సి రాదు. ఎప్పుడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. విపత్కర పరిస్తితులు సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులా, కోర్టు కేసులు ఉన్న నిర్మాణాలు చేపడుతున్న బిల్డర్ల అత్యాశ అంటూ సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చందానగర్ సర్కిల్ పరిధిలో ఉన్న అయ్యప్ప సొసైటీ విస్తీర్ణం పెద్దగా ఉండటంతో పర్యవేక్షణ అంతంత మాత్రమే ఉంటుందని అనుకోవచ్చు. మాదాపూర్ ప్రత్యేక సర్కిల్ గా ఏర్పాటు డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ హబీబా, సెక్షన్ ఆఫీసర్ సంతోష్ తోపాటు ఇద్దరు చైన్ మాన్ లు విధులు నిర్వహిస్తున్నారు. పరిధి చిన్నదైతే పర్యవేక్షణ పెరగాలి. కానీ అక్కడ అలా జరగడం లేదు.ఈ విషయంపై మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణను వివరణ కోరగా అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తామన్నారు. ఇప్పటికే నోటీసులు జారీ చేశామని త్వరలోనే సదరు భవనాలు కూల్చివేతలు చేపడతామని స్పష్టం చేశారు.

Next Story