కన్నపు దొంగల ముఠా గుట్టు రట్టు

by Bhanu |

మండలంలోని వెంకటయ్యపల్లి గ్రామంలో జూన్ 8, 2025న జరిగిన భారీ దొంగతన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి, 20 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి, ఒక మోటార్‌సైకిల్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కన్నపు దొంగల ముఠా గుట్టు రట్టు
X

దిశ, గంగాధర: మండలంలోని వెంకటయ్యపల్లి గ్రామంలో జూన్ 8, 2025న జరిగిన భారీ దొంగతన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి, 20 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి, ఒక మోటార్‌సైకిల్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. వెంకటయ్యపల్లి గ్రామానికి చెందిన ఉప్పుగండ్ల గంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు, ఐదుగురు నిందితులను గుర్తించి, వీరిలో ఇద్దరిని శుక్రవారం రోజున గంగాధర క్రాస్ రోడ్డులో వాహన తనిఖీల్లో ఒక్కరిని అరెస్ట్ చేశారు.


అరెస్ట్ చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు కరీంనగర్ బస్టాండ్లో ఇంకొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాల ప్రకారం, బాధితుడు ఇంటి నుంచి మధ్యాహ్నం బయటికి వెళ్లి తిరిగి వచ్చినపుడు ఇంటి తలుపులు పగులగొట్టి రూ. 3.75 లక్షల విలువైన 33 తులాల బంగారు ఆభరణాలు, రూ. 12,500 విలువైన వెండి, రూ. 25,000 నగదు చోరీకు గురైనట్టు తెలిపారు. దర్యాప్తులో భాగంగా, కోనరావుపేటకు చెందిన గాజుల హేమంత్ (19), కొమ్ము నవీన్ కుమార్ (20) లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

వీరిలో హేమంత్ IIFL ఫైనాన్స్‌లో గొలుసు కుదవబెట్టి రూ. 64,000 తీసుకున్నట్టు విచారణలో వెల్లడించాడు. దొంగిలించిన బంగారాన్ని పంచుకొని కొంత భాగం మానకొండూర్‌లో విక్రయించినట్టు తెలిపాడు. అరెస్ట్ సమయంలో వారి వద్ద నుంచి 20 తులాల బంగారం, 25 తులాల వెండి, ప్యాషన్ ప్లస్ బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మిగిలిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ కేసును ఛేదించడంలో రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, చొప్పదండి సీఐ ప్రదీప్, గంగాధర ఎస్సై వంశీకృష్ణ, క్లూస్ టీం, సీసీఎస్, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ సహకారాన్ని పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ అభినందించారు.

Next Story