- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐడెంటిటీ క్రైసిస్‌లో జీవన్ రెడ్డి? పొమ్మన లేక పొగ పెడుతున్నారా..?
కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీలో ఒంటరయ్యారా? వరుసగా ఓటమి చెందుతూ వస్తున్న ఆయనను పార్టీ హై కమాండ్ సైతం దూరం పెడుతుందా? కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూనే కాంగ్రెస్ లో ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎంట్రీతో జీవన్ రెడ్డి రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందా? ఒకప్పుడు జగిత్యాల లో కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి..

దిశ, జగిత్యాల ప్రతినిధి : కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీలో ఒంటరయ్యారా? వరుసగా ఓటమి చెందుతూ వస్తున్న ఆయనను పార్టీ హై కమాండ్ సైతం దూరం పెడుతుందా? కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూనే కాంగ్రెస్ లో ఉన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎంట్రీతో జీవన్ రెడ్డి రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందా? ఒకప్పుడు జగిత్యాల లో కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి.. జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ అన్నంతగా గుర్తింపు పొందిన ఆయన ప్రస్తుతం ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారా? తాజాగా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇవే చర్చలు నడుస్తున్నాయి. దానికి తోడు బహిరంగ వేదికలపై జీవన్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ ఇద్దరు లీడర్ల ఎపిసోడ్ పై ఇంతవరకు రియాక్ట్ అవ్వని పార్టీ పెద్దలు సైతం తాజా ఘటనపై స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
నామినేటెడ్ పదవులపై పెద్దాయన అలక
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని జీవన్ రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల నేపథ్యంలో సంజయ్ కుమార్ తాను గులాబీ పార్టీకి రాజీనామా చేయలేదని చెప్తూనే కాంగ్రెస్ తో దోస్తీలో ఉన్నారు. ఇంతకాలం చాప కింద నీరులా ఉన్న ఈ విభేదాలు కాస్త ఆలయ కమిటీల ఎంపిక కారణంగా తారా స్థాయికి చేరాయి. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడిన వారిని పక్కన పెట్టి వలస వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారంటూ జీవన్ రెడ్డి మంత్రి అడ్లూరి ముందు అసహనం వ్యక్తం చేశారు.ఎట్టి పరిస్థితుల్లో వలస వచ్చిన లీడర్ల ముందు తాము తలవంచబోమని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా మోస్తున్న వారిని కాదని ఇతరులకు పదవులు ఎలా కట్టబెడతారని పార్టీ పెద్దల తీరును బహిరంగంగానే తప్పు పట్టారు. దయచేసి మానసిక క్షోభ కు గురి చేయకండని జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ పార్టీ వర్గాల్లో సంచలనంగా మారాయి.
పొమ్మనలేకనే పొగ పెడుతున్నారా..?
రాష్ట్ర రాజకీయాల్లో జగిత్యాల నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక పెద్ద లీడర్ జీవన్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్సీగా పని చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ఆవిర్భవించడం ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఆశించిన రిజల్ట్స్ రాక రాజకీయాల్లో క్రమంగా పదవులతో పాటు తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చారు. దానికి తోడు మారిన పరిస్థితుల కారణంగా కొత్త లీడర్లు పార్టీలో చేరడం ఒక ఎత్తు అయితే ఆ లీడర్ల అనుచరులకు పదవులు కట్టబెట్టడం జీవన్ రెడ్డికి మింగుడు పడడం లేదు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో ఉన్న రాజకీయ వైరం కారణంగా అనేకసార్లు ఆయన చేరికపై బహిరంగ వేదికలపైనే జీవన్ రెడ్డి పార్టీ తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలో పార్టీ పెద్దలు సైతం జీవన్ రెడ్డిని పెద్దగా పట్టించుకోవడం లేదనే టాక్ నడుస్తుంది.
ముదురుతున్న పదువుల వివాదం
జగిత్యాల నియోజకవర్గంలో ఎండోమెంట్ పరిధిలో ఉన్న ఆలయ కమిటీల్లో పొలాస పౌలస్తీశ్వర ఆలయం, బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీల్లో అసలు కాంగ్రెస్ సభ్యత్వం లేని కొందరిని ఆలయ కమిటీ సభ్యులుగా నియమించడంపై జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే నిన్న దీపావళి రోజు ధర్మపురిలో మంత్రి అడ్లూరి అనుచరులతో వెళ్లి కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జీవన్ రెడ్డిలు ఎవరి వర్గంలో ఉన్న క్యాడర్ కు వాళ్లు నామినేటెడ్ పదవులు ఇప్పించుకునే క్రమంలో ఇలాంటి గొడవలు తెరపైకి వస్తున్నాయి. ఈ పదవుల విషయమై జీవన్ రెడ్డి బహిరంగంగా పార్టీ తీరని తప్పు పడుతుండగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.
తొలిసారి స్పందించిన పార్టీ హైకమాండ్
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ పై ఆ పార్టీ హై కమాండ్ తొలిసారిగా స్పందించింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ లో కౌలుదారులు పట్టాదారులు అంటూ ఎవరు లేరని జీవన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ సమానమేనన్న ఆయన త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని అన్నారు. పార్టీలో పార్టీలో కష్టపడిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే ఎంతటి వారైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.






